మేడిగడ్డ బ్యారేజిపై శాసనసభలో నిన్న జరిగిన చర్చలో సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుల మద్య వాగ్వాదం జరిగినప్పుడు, “రేవంత్ రెడ్డి సిఎం పదవికి రాజీనామా చేసి తప్పుకుంటే నేను సిఎంగా ప్రమాణస్వీకారం చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్దంగా ఉన్నాను. మేడిగడ్డ బ్యారేజికి మరమత్తులు చేయించి చూపిస్తాను,” అంటూ హరీష్ రావు ప్రతి సవాలు విసిరారు.
ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శాసనసభ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ, “హరీష్ రావుకి ఇంకా ముఖ్యమంత్రి కావాలనే కోరిక అలాగే ఉన్నట్లుంది. కానీ ఆయన కల ఎన్నటికీ నెరవేరదు. బిఆర్ఎస్లో ఉండగా ఆయన కనీసం ఆ పార్టీ సీఎల్పీ లీడర్ కూడా కాలేరు. కనుక ఆయన పార్టీని వదిలి బయటకు వస్తే, కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఇచ్చి గౌరవించేందుకు మేము సిద్దంగా ఉన్నాము.
ఒకవేళ హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటే హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురే ఏదో రోజు ఆ పార్టీని మూడు ముక్కలు చేయడం ఖాయం.
చేతికర్ర పట్టుకుని తిరుగుతున్న కేసీఆర్ నేను పులిని గర్జిస్తానంటే ఎవరైనా భయపడుతారా?ఆయనకు కూడా ఇంకా ముఖ్యమంత్రి పదవి యావ తీరిన్నట్లు లేదు. అందుకే మా ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు. కానీ ఆయనకు జీవితంలో మళ్ళీ ఎన్నటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాదు. మా కాంగ్రెస్ ప్రభుత్వమే మరో 10-20 ఏళ్ళు అధికారంలో ఉంటుంది,” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.