మేడిగడ్డ ఇంకా ఎన్ని సార్లు చూస్తారు? బండి సంజయ్‌ ప్రశ్న

కృష్ణా జలాలు, ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ ఆధిపత్య పోరులో  పైచేయి సాధించడానికి రెండు పార్టీలు తమ పద్దతిలో ప్రయత్నిస్తున్నాయి. 

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ బహిరంగ సభ నిర్వహించి, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే, రేవంత్‌ రెడ్డి, మంత్రులు అధికారులు, మీడియాని వెంటబెట్టుకొని మేడిగడ్డ బ్యారేజి వద్దకు వెళ్ళి అది ఏవిదంగా క్రుంగిపోయిందో మరోసారి పరిశీలించి, దెబ్బతిన్న పియర్స్, బ్యారేజి గోడలను మీడియాకు చూపించారు. తద్వారా కేసీఆర్‌, హరీష్ రావు గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని నిరూపించి చూపేందుకు కాంగ్రెస్‌ మంత్రులు ప్రయత్నించారు. 

కాంగ్రెస్‌ బస్సు యాత్రపై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ స్పందిస్తూ, “కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, కేసీఆర్‌ కుటుంబం వేలకోట్లు వెనకేసుకుందని రేవంత్‌ రెడ్డి, మంత్రులు ఆరోపిస్తున్నారు.

మరి కేసీఆర్‌ అవినీతిని రుజువు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నట్లయితే, దీనిపై సీబీఐ విచారణ కోరవచ్చు కదా? సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్‌ అవినీతి బయటపడుతుంది కదా?

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? కేసీఆర్‌ని కాపాడాలని అనుకుంటోందా?అందుకే న్యాయ విచారణ పేరుతో చర్యలు తీసుకోకుండా కాలక్షేపం చేస్తున్నారా?

మేడిగడ్డ బ్యారేజి ఈరోజు కొత్తగా క్రుంగిపోలేదు. క్రుంగిపోయిన బ్యారేజిని ఇంకా ఎన్నిసార్లు వెళ్ళి చూసొస్తారు?” అని ప్రశ్నించారు.