రాష్ట్ర తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రైతుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ నవంబర్ 6 నుంచి రాష్ట్రంలో ‘రైతుపోరు యాత్ర’ పేరిట పాదయాత్ర నిర్వహించబోతున్నారు. భూపాలపల్లి నుంచి రేపు పాదయాత్ర మొదలుపెట్టి ఖమ్మం, పెదపల్లి, మద్దూరు, సూర్యాపేట మీదుగా తన నియోజకవర్గం కొడంగల్ వరకు పాదయాత్రలు చేస్తారు. ఆ సందర్భంగా ఆ ప్రాంతాలలో బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. ఈ నెల 30న కొడంగల్ ల్లో బారీ బహిరంగ సభతో పాదయాత్రలు ముగిస్తారు.
ఎన్నికల సమయంలో కెసిఆర్ రైతుల రుణమాఫీలు చేస్తానని హామీ ఇచ్చారని కానీ ఇంతవరకు మాఫీ చేయకుండా వారిని మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ కారణంగా తీవ్ర ఆర్ధిక సమస్యలని ఎదుర్కొంటున్న 2,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, తెరాస సర్కార్ కనీసం వారి కుటుంబాలని పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల కారణంగా కూడా రైతులు చాలా నష్టపోతున్నారని కానీ ప్రభుత్వం వాటిని తయారు చేస్తున్న సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్-పుట్ సబ్సిడీ కోసం కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన రూ.790 కోట్లని తెరాస సర్కార్ రైతులకి ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే వారు పండుగ చేసుకొంటున్నారని తెరాస సర్కార్ చెప్పుకోవడం రైతులని అవహేళన చేయడమేనని అభిప్రాయపడ్డారు. జలాశయాలు అన్నీ నిండితే పాలమూరులో ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చుకోవలసిన పరిస్థితి ఎందుకు నెలకొని ఉందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళేందుకే తను పాదయాత్రలు నిర్వహిస్తున్నాణు తప్ప ఎన్నికల కోసమో లేదా రాజకీయ లబ్ది పొందాలనో కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఇతర పార్టీలు చేస్తున్న పోరాటాలకి తాము మద్దతు పలుకుతామని. అలాగే తాము చేస్తున్న పోరాటాలకి ప్రతిపక్షాల మద్దతు కోరుతామని రేవంత్ రెడ్డి చెప్పారు.