లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌కు ఓట్లు వేస్తే దండగే

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో మళ్ళీ మూడు పార్టీల మద్య మాటల యుద్ధాలు ప్రారంభం అయ్యాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలలో జాతీయ స్థాయిలో, ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది. లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీకి మరోసారి పరాభవం తప్పదు. బిఆర్ఎస్‌కు ఓట్లు వేసి గెలిపించినా ఏం ప్రయోజనం?

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డితో సహా అన్ని బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్రమోడీని కలిసి తమతమ రాష్ట్రాలకు నిధులు, ప్రాజెక్టులు సాధించుకుంటున్నారు. కానీ కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ వచ్చినా మొహం చాటేస్తారు. కనుక బిఆర్ఎస్‌ పార్టీకి ఓట్లు వేస్తే అవన్నీ వృద్ధాయే. 

కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలలో పార్టీ టికెట్లు అమ్ముకుంటారు. తెలంగాణ కోసం పోరాడినవారిని, వారి కుటుంబాలను కాదని, సూట్ కేసులు పట్టుకువచ్చిన వారికే టికెట్లు ఇస్తుంటారు. అలాంటివారిని గెలిపించుకున్నా తెలంగాణకు ఏం మేలు చేయగలరు? 

కేసీఆర్‌ సింహం, పులి అంటూ కేటీఆర్‌ ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు? ఆయన సింహమూ కాదు పులీ కాదూ... కలుగులో దాక్కొనే ఎలుకవంటివారు. బిఆర్ఎస్‌ పార్టీకి దమ్ముంటే కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీష్ రావు, సంతోష్ ఐదుగురు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని సవాలు విసురుతున్నాను,” అని అన్నారు.