తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీ పధకాలకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా వాటిలో అత్యధికంగా మహాలక్ష్మీ పధకాలకే దరఖాస్తులు వచ్చాయి.
ఈ పధకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 పింఛన్ కోసం 92,23,195 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.
దీని తర్వాత అత్యధికంగా రూ.500లకు వంట గ్యాస్ సిలిండర్ల కొరకు 91,49,838 మంది, ఇందిరమ్మ ఇండ్ల కోసం 82,82,332 మంది, గృహజ్యోతి పధకం కింద నెలకు 200 యూనిట్లు విద్యుత్ కొరకు 81,54,158 మంది దరఖాస్తు చేసుకున్నారు.
రైతు భరోసా పధకం కింద సొంత వ్యవసాయ భూమి సాగుచేస్తున్న రైతులకు కౌలు రైతులకు రూ.15,000, రైతు కూలీలకు రూ.12,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చింది. ఈ పధకాల కొరకు 38,73,956 మంది రైతులు, 2,63,616 కౌలు రైతులు, 40,95,581 రైతు కూలీలు దరఖాస్తు చేసుకున్నారు.
దివ్యాంగుల పింఛన్ల కొరకు కొత్తగా 2,77,292 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. వీటి కోసం 23,794 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అన్ని రకాల పధకాలకు కలిపి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందగా, వాటిలో ఇప్పటి వరకు 1,09,00,662 దరఖాస్తులను డేటా ఎంట్రీ సిబ్బంది కంప్యూటర్లలో ఎక్కించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.
సుమారు ఒక కోటి 25 లక్షల మందికి ఏ ప్రభుత్వమైనా ఇన్ని సంక్షేమ పధకాలు అందించడం అసాధ్యమే. వీటి కోసం లక్షల కోట్లు అవసరం ఉంటుంది. కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉందని, కేసీఆర్ తమ చేతికి చిప్ప ఇచ్చి దిగిపోయారని కాంగ్రెస్ మంత్రులు చెపుతున్న సంగతి తెలిసిందే. చేతిలో చిల్లి గవ్వలేన్నప్పుడు ఆరు గ్యారెంటీ పధకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏవిదంగా అమలుచేస్తుందో?