ఈ నెల 28న తెలంగాణలో అమిత్ షా పర్యటన

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలు తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి. బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినందున, ఈ ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవలసి ఉంది. లేకుంటే పార్టీ శ్రేణులకు నాయకత్వంపై అపనమ్మకం ఏర్పడితే బిఆర్ఎస్ చెల్లాచెదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. 

శాసనసభ ఎన్నికలలో గెలిచి తొలిసారిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, లోక్‌సభ ఎన్నికలలో గెలిస్తే బిఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుందని భావిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్‌ లేదా ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ప్రతీ ఎంపీ సీటు చాలా కీలకమే. కనుక రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లలో ఈసారి 12 గెలుచుకోవాలని రేవంత్‌ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు. 

కేంద్రంలో బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది కనుక ఈసారి ఎన్నికలలో మోడీ ప్రభుత్వంపై సహజంగానే దేశ ప్రజలలో కొంత వ్యతిరేకత నెలకొని ఉంటుంది. కనుక కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతీ ఒక్క సీటు బీజేపీకి చాలా ముఖ్యమే. కనుక ఈసారి తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. 

ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఆరోజు మొదట కరీంనగర్‌, మహబూబ్ నగర్‌ జిల్లాలలో పర్యటించి చివరిగా హైదరాబాద్‌లో బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లు, వ్యూహాల గురించి చర్చించనున్నారు.