అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం షాక్

కాంగ్రెస్‌ అధిష్టానం అద్దంకి దయాకర్‌కు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒక దానికి ఆయన పేరు ఖరారు చేసి ఈరోజు నామినేషన్ వేయాల్సిందిగా ఆదేశించిన్నట్లు నిన్న వార్తలు వచ్చాయి.

కానీ చివరి నిమిషంలో ఆయనను పక్కన పెట్టి మహేష్‌ కుమార్‌ గౌడ్‌కి ఆ సీటు ఖరారు చేస్తూ ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. అద్దంకి దయాకర్‌కు గ్రాడ్యూయేట్ లేదా స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. 

మహేష్‌ కుమార్‌ గౌడ్ కూడా బల్మూరి వెంకట్‌లాగే 1986 నుంచే విద్యార్ధి సంఘం నాయకుడుగా కాంగ్రెస్‌తో మంచి అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో యూత్ కాంగ్రెస్‌, పిసిసి కార్యదర్శి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవులలో పనిచేశారు.

తొలిసారిగా 2014 శాసనసభ ఎన్నికలలో నిజామాబాద్‌ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. 2023 ఎన్నికలలో మళ్ళీ పోటీ చేయాలనుకున్నా పార్టీ అధిష్టానం సూచన మేరకు ఆ ఆలోచన విరమించుకుని పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ సీటుని ఖరారు చేసింది.

నేడు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్‌ గౌడ్ ఇద్దరూ నామినేషన్స్‌ వేయనున్నారు. ఇవి ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎన్నికలు కనుక వారి గెలుపు లాంఛనప్రాయమే. కాంగ్రెస్‌ అధిష్టానం వారిని అభ్యర్ధులుగా ప్రకటించినప్పుడే వారు ఎమ్మెల్సీలు అయిపోయిన్నట్లే.