తెలంగాణలో తిరుగేలేదనుకున్న బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడం ఆ పార్టీ నేతలకు పెద్ద షాక్.. జీర్ణించుకోవడం కష్టమే. కేటీఆర్, హరీష్ రావు మాటలలో ఆ విషయం బయటపడుతూనే ఉంది. శుక్రవారం తెలంగాణ భవన్లో భువనగిరి లోక్సభ నియోజకవర్గం నేతలతో సమావేశమైనప్పుడు కేటీఆర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కొన్ని కారణాలు చెప్పారు.
• మనం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి పనిలో పడి పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోలేకపోయాము.
• రాష్ట్రాభివృద్ధి గురించే ఆలోచిస్తూ ఉండిపోయాము తప్ప చేస్తున్న పనుల గురించి గట్టిగా ప్రచారం చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలాగా మనం కూడా పనికంటే ప్రచారం మీదే ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఎన్నికలలో తప్పకుండా మనమే గెలిచి ఉండేవాళ్ళం.
• బిఆర్ఎస్ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. 119 స్థానాలలో మూడో వంతు సీట్లు మనకు ఇచ్చి గెలిపించారు. కనుక మనం పూర్తిగా ఓడిపోయినట్లు కాదు.
• కాంగ్రెస్ పార్టీ ఎలాగూ గెలిచి అధికారంలోకి రాలేదని భావిస్తూ నోటికి వచ్చిన్నట్లు హామీలు ఇచ్చింది. ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆ పార్టీని గెలిపించారు తప్ప మనల్ని వద్దనుకొని కాదు.
• ఇతర పార్టీల నుంచి వచ్చినవారితో మాట్లాడేందుకు తగినంత సమయం, ప్రాధాన్యత ఇవ్వలేకపోయాము. పార్టీ కార్యకర్తల ఆర్ధిక పరిస్థితిని కూడా గమనించలేకపోయాము.
• దళిత బంధు కొందరికే రావడంతో మిగిలినవారు మనపై ఆగ్రహంతో వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
• రైతు బంధు అందుకున్న సామాన్య రైతులతో సమానంగా భూస్వాములకు కూడా ఈ పధకాన్ని వర్తింపజేయడాన్ని వ్యతిరేకించారు.
ఇటువంటి కొన్ని కారణాల వలన మనం ఎన్నికలలో ఓడిపోయాము. ఏ కారణంతో ఓడిపోయినప్పటికీ పార్టీ ఓటమికి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఇటువంటి లోపాలను సవరించుకుని లోక్సభ ఎన్నికలలో విజయం సాధిద్దాము,” అని కేటీఆర్ అన్నారు.