మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నల్గొండలో విలేఖరులతో మాట్లాడుతూ, “నా కొడుకు అమిత్ రెడ్డి ఈసారి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోతున్నాడు. నల్గొండ లేదా భువనగిరి నియోజకవర్గాలలో ఏదో ఓ చోటి నుంచి పోటీ చేస్తాడు,” అని చెప్పారు.
శాసన మండలి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నిండిపోయిందని, సమావేశాలలో వారు వ్యాపార లావాదేవీల గురించే మాట్లాడుకుంటారని సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా విలేఖరులు కోరినప్పుడు, “ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి చులకనగా మాట్లాడటం సరికాదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనపై స్పందించాల్సిందిగా విలేఖరులు కోరగా, “నెల రోజులకే ఒకరి పరిపాలనను సమర్ధించడం లేదా విమర్శించడం తొందరపాటే అవుతుందని భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని భావిస్తున్నాను,” అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
ఇంతకీ గుత్తా అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ కేసీఆర్ ఖరారు చేశారా లేక గుత్తా సుఖేందర్ రెడ్డే ఖరారు చేసుకున్నారా? త్వరలో తెలుస్తుంది.