తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుంచి 1,24,85,383 వినతి పత్రాలు అందాయి. ముందుగా వాటన్నిటినీ కంప్యూటర్లలోకి ఎక్కిస్తారు. ఈ నెల 17వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ తర్వాత వాటిలో నుంచి వివిద పధకాలకు అర్హుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది.
ప్రజలు సమర్పించిన వినతి పత్రాలలో ఎక్కువగా మహాలక్ష్మి పధకం క్రింద మహిళలకు నెలకు రూ.2,500 పింఛను, రూ.500లకు రాయితీ గ్యాస్ సిలిండర్స్, కొత్త తెల్ల రేషన్ కార్డులు, గృహజ్యోతి పధకం కింద ఇందిరమ్మ ఇళ్ళు, రైతుబంధు, భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి.
ప్రజా పాలన కార్యక్రమం శనివారంతో ముగిసినప్పటికీ స్థానిక మండల కార్యాలయాలలో దరఖాస్తులు సమర్పించవచ్చని అధికారులు చెప్పారు. మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే ఏప్రిల్-మే నెలల్లో ఈ కార్యక్రమం చేపడతామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 56 లక్షలకు పైగా వివిద వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అందిస్తోంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకొన్న ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం తప్పకుండా తమ సమస్యలని పరిష్కరిస్తుందనే నమ్ముతున్నారు.
కానీ రాష్ట్ర జనాభాలో పావువంతు మంది సమస్యలు పరిష్కరించాలంటే వాటి కోసం ప్రభుత్వం కనీసం లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. కనుక కొత్తగా అప్పులు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ చేసినా మంచిది కాదు. మరి సిఎం రేవంత్ రెడ్డి, ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క ఎక్కడ నుంచి డబ్బు పుట్టించి తెస్తారో?