తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు మంత్రుల బృందం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జి.వివేక్ తదితరులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలను సందర్శించారు.
సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు, దానికైనా ఖర్చు, ఎత్తిపోతలకు వినియోగిస్తున్న విద్యుత్, ఈ ప్రాజెక్టు కింద సాగవుతున్న ఆయకట్టు వివరాలను వివరించారు. అనంతరం వారు బ్యారేజి సమీపంలో ప్రభుత్వ అతిధి గృహం వద్ద మీడియాకు అన్ని వివరించారు.
రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, “నిర్మాణ, నిర్వహణ లోపాల వలన మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోతే ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆనాడు కేసీఆర్ దీనిలో కుట్రకోణం ఉందేమో అంటూ ఆ కోణంలో విచారణ జరిపించారు. కానీ బ్యారేజిలో పది టీఎంసీల నీళ్ళు నిలువ ఉన్నప్పుడు ఎటువంటి కుట్రాలకు ఆస్కారం లేదని పోలేసులే తేల్చి చెప్పేశారు.
ఆసియా ఖండంలోకే అతిపెద్ద, అతిగొప్ప ప్రాజెక్టు ఇది అంటూ కేసీఆర్ తదితరులు గొప్పలు చెప్పుకొన్నారు. ప్రత్యేకంగా బస్సులు వేసి జనాలకు చూపించారు. కానీ మేడిగడ్డ బ్యారేజి క్రుంగినప్పటి నుంచి పోలీసులను కాపలా పెట్టించి చుట్టుపక్కలకు ఎవరినీ రానీయకుండా చేశారు. కానీ ఇప్పుడు ఏమైంది? యావత్ దేశం ముందు తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తలదించుకొనే పరిస్థితి ఏర్పడింది,” అని అన్నారు.