ఛార్లస్ శోభారాజ్‌ని అడిగినా నేరం చేయలేదంటాడు: రేవంత్‌

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బుధవారం సచివాలయంలో ప్రజా పాలన పోస్టర్స్ విడుదల చేస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజి క్రుంగింది. అలాగే కాలం చెల్లిన టెక్నాలజీతో నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులపై, ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వంతో చేసుకొన్న విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ జరిపిస్తున్నాము. ఆ విచారణలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురూ ఎంత అవినీతికి పాల్పడ్డారనే విషయం బయట పడుతుంది. 

ఛార్లస్ శోభారాజ్‌ని అడిగినా నేను ఏ నేరం చేయలేదనే చెపుతాడు. అలాగే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు కూడా! న్యాయ విచారణ జరిపి రెవెన్యూ రికవరీ చట్టం కింద వారు తిన్నదంతా కక్కిస్తాము. తెలంగాణకు వాళ్ళు సంపద సృష్టించడం కాదు... వాళ్ళే తెలంగాణ సంపదని దోచుకున్నారు. ఈరోజు వారు తింటున్నది తెలంగాణ ప్రజల రక్తపు కూడే,” అని రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

శాసనసభలో హరీష్ రావు, కేటీఆర్‌ చేసిన ప్రసంగాల గురించి మాట్లాడుతూ, “వెనకటికి రోళ్ళకల్లి నిప్పులు చిమ్మేలా ఇద్దరు దంచుతుంటే దారిన పోయే ముసలావిడ ఖాళీ రోట్లో ఎగిరెగిరి ఎంత దంచినా ఏం ప్రయోజనం” అందన్నట్లు, శాసనసభలో బావబావామరుదుల దంచుడు సాగింది. వాళ్ళు అంతగా దంచుతుంటే సభలో ఉన్న ఒక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా వారికి మద్దతుగా మాట్లాడరా?” అని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరుని నిశితంగా గమనించేందుకు బిఆర్ఎస్ పార్టీ ‘షాడో టీమ్స్’ ఏర్పాటు చేస్తుందన్న కేటీఆర్‌ మాటలపై స్పందిస్తూ, “మా కొడంగల్‌, ఇతర ప్రాంతాలలో కల్తీ కల్లుకి అలవాటు పడి ఎగిరెగిరి గంతులు వేసేవారిని ఇంట్లో వాళ్ళు మంచానికేసి కట్టి పడేస్తుంటారు. అధికారం కోల్పోయి అఫిడవిట్‌ డ్రావల్ సింప్టంస్‌తో బాధపడుతున్న కేటీఆర్‌ని కూడా ఇంట్లో వాళ్ళు కొన్ని రోజులు అలాగే కట్టి ఉంచితే కానీ సర్దుకోలేరు,” అంటూ సిఎం రేవంత్‌ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. 

టిఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై త్వరలోనే ఆమోదించగానే కొత్త బోర్డుని ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం జాబ్ క్యాలెండర్ కూడా అమలుచేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.