న్యూస్ ఛానల్ కి శిక్ష!

మీడియా తరచూ చాలా విషయాలలో అత్యుత్సాహం ప్రదర్శించడం, దానిపై ప్రభుత్వాలు నిషేధాలు విదించడం చూస్తూనే ఉంటాము. మళ్ళీ అటువంటిదే ఒక సంఘటన జరిగింది. ప్రముఖ హిందీ న్యూస్ ఛానల్ ఎన్.డి.టి.వి.పై కేంద్ర, సమాచార ప్రసారశాఖ ఒకరోజు నిషేధం విదించింది. ఈ ఏడాది జనవరిలో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు, దాని గురించి వర్ణించే క్రమంలో ఆ న్యూస్ ఛానల్ వైమానిక స్థావరంలోని చాలా కీలకమైన ప్రదేశాలని, అక్కడ ఉండే ఆయుధ సంపత్తిని కూడా చిత్రీకరించి ప్రసారం చేసింది. దేశభద్రతతో ముడిపడున్న సమాచారం టీవీ ఛానల్లో ప్రసారం చేయడం ద్వారా యావత్ ప్రపంచానికి పఠాన్ కోట్ లోపల ఏమేమి ఉన్నాయో, అక్కడికి ఏవిధంగా చేరుకోవాలో చూపించినట్లయింది. 

ఆ వ్యవహారంపై విచారణ జరిపిన కేంద్ర సమాచార, ప్రసారశాఖ సబ్ కమిటీ సదరు ఛానల్ పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడంతో, ఈనెల 9వ తేదీన ఒక్కరోజు మొత్తం దాని ప్రసారాలు నిలిపివేయవలసిందిగా ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. న్యూస్ ప్రసార నియమనిబంధనలు ఉల్లంఘించి దేశ భద్రతకి ముప్పు కలిగించే అంశాలని ప్రసారం చేసినందుకు దానిపై ఈ చర్య తీసుకొంటునట్లు తెలిపింది. 

ఈ ఒక్క రోజు నిషేధంపై ఎన్.డి.టి.వి.యాజమాన్యం ఇంకా స్పందించలేదు. కేంద్రప్రభుత్వం ఆదేశాలు మన్నించి స్వచ్చందంగా ప్రసారాలు నిలిపి వేసుకొంటే మంచిదే లేదా జరిగిన దానికి క్షమాపణలు చెప్పుకొఇ నిషేధాన్ని సడలించమని విజ్ఞప్తి చేసినా మంచిదే కానీ కేంద్రంపై న్యాయపోరాటానికి సిద్దం అయితే సమస్య తీవ్రతరం అవుతుంది.