కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అప్పులలో మునిగిపోయిందని, ప్రభుత్వంతో సహా పలు సంస్థలు రోజువారీ ఖర్చుల కోసం రిజర్వ్ బ్యాంక్ ముందు నిలబడాల్సి వస్తోందని, కేసీఆర్ ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా విచ్చలవిడిగా అప్పులు చేయడం వలననే ఈ దుస్థితి దాపురించిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
దీనిపై ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా తప్పించుకొనేందుకే ఈవిదంగా అబద్దాలు చెపుతోందని, దీని వలన తెలంగాణ ప్రతిష్ట దెబ్బ తింటుందని మాజీ మంత్రి కేటీఆర్ శాసనసభలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన వాదనలకు కట్టుబడి విద్యుత్ రంగంపై కూడా శ్వేతపత్రం విడుదల చేసి, బిఆర్ఎస్ హయాంలో ఛత్తీస్ఘడ్ ప్రభుత్వంతో జరిగిన విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణాలపై జ్యూడీషియల్ విచారణకు ఆదేశించింది.
దీనిపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ స్పందిస్తూ, “తొమ్మిదిన్నరేళ్ళు రేయింబవళ్ళు ఎంతో కష్టపడి నిర్మించుకొన్న తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే సహించబోము. తొమ్మిదిన్నరేళ్ళలో తెలంగాణలో అన్ని రంగాలలో జరిగిన అభివృద్ధిపై రేపు తెలంగాణ భవన్లో శ్వేద పత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాము,” అని ట్వీట్ చేశారు.