జగదీష్ రెడ్డీ... అన్ని వేలకోట్ల ఆస్తులు ఎలా సంపాదించావు?

ఈరోజు శాసనసభలో విద్యుత్ శాఖపై అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యుల మద్య చాలా వాడివేడిగా వాగ్వాదాలు సాగాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు మాజీ విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెపుతున్నప్పుడు మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలుగజేసుకొని, “యాదాద్రి ప్రాజెక్టులో నువ్వు అవినీతికి పాల్పడ్డావని అందరికీ తెలుసు. లేకుంటే నీకు అన్నివేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించగలిగావు? రాష్ట్రంలో అన్ని ఖరీదైన ఇళ్ళు ఎలా కొనగలిగావు?అంటూ నిలదీశారు. 

దీనిపై ఆయన తీవ్ర అభ్యంతరం చెప్పారు. “నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యేపై స్పీకర్‌ చర్య తీసుకోవాలని, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను శాసనసభ రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కలుగజేసుకొని, “అభివృద్ధి పేరు చెప్పి వేలకోట్లు దోచుకొన్న గొప్ప చరిత్ర మీ బిఆర్ఎస్ పార్టీది. అవినీతికి పాల్పడినందునే ఇన్ని బంగ్లాలు కొనగలిగావని నేను అన్నప్పుడు లేదని చెప్పే ధైర్యం ఉందా?,” అని అనడంతో జగదీష్ రెడ్డి కూడా సహనం కోల్పోయి, “కాంట్రాక్టుల కోసం ఏడాదికో పార్టీ మారే నువ్వా నన్ను విమర్శించేది. మీ అన్నదమ్ములిద్దరికీ వ్యక్తిగత విమర్శలు చేసే దూరాలవాటు ఇంకా పోలేదు,”అంటూ ఘాటుగా బదులిచ్చారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ స్పందిస్తూ, “నేను ప్రజల కోసమే పార్టీలు మారాను తప్ప కాంట్రాక్టుల కోసం కాదు. అయినా ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే వేరే పార్టీలో చేరాను. కాంట్రాక్టుల కోసం పార్టీలు మారానంటూ పదేపదే ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మీ బిఆర్ఎస్ పార్టీ త్వరలోనే కనుమరుగు అవుతుంది. మీ పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత తప్ప మరెవరూ మిగలరు,” అని బదులిచ్చారు.