బిగ్‌బాస్ రియాల్టీ షోలో హేమాహేమీలైన అనేకమందితో పోటీ పడి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. విజేతగా ప్రకటింపబడిన రోజు రాత్రే ఆయన అభిమానులకు, రన్నర్ అప్‌గా నిలిచిన అమర్ దీప్ అభిమానులకు మద్య హైదరాబాద్, అన్నపూర్ణ స్టూడియోస్ బయట పెద్ద గొడవ జరిగింది.
అప్పుడు ఇరు వర్గాలు రెచ్చిపోయి దారిన పోయే ఆర్టీసీ బస్సులపై రాళ్ళతో దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీస్ వాహనంపై కూడా దాడి చేశారు. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకొని పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడు రఘురాజ్‌లను అరెస్ట్ చేశారు, వారితో సహా పలువురిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూరుకు చెందిన ఓ నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ జీవితంలో అనేక కష్టానష్టాలను ఎదుర్కొని బిగ్‌బాస్ వరకు రాగలిగాడు. బిగ్‌బాస్‌లో కూడా అనేకమందితో పోటీ పడి విజేతగా నిలిచాడు. ఎంతో కష్టపడి ఈ విజయం సాధిస్తే, అభిమానులు చేసిన గొడవ కారణంగా ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే దుస్థితి ఏర్పడటం చాలా బాధాకరమే.