ఇప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు కదా! హరీష్ రావు

ఈరోజు శాసనసభలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పుల గురించి చర్చ జరుగుతున్నప్పుడు, సిఎం రేవంత్‌ రెడ్డి టిఎస్ ఐఐసీ అప్పులని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ మళ్ళీ దాని అప్పులకి ప్రభుత్వం బాధ్యత వహించదని ఏవిదంగా అంటారని నిలదీశారు.

దానికి హరీష్ రావు సమాధానం చెపుతూ, “మీరు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు కదా? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. టిఎస్ ఐఐసీ అప్పులకి ప్రభుత్వం బాధ్యత వహించదు. కానీ మద్యలో ఉండి దానికి అప్పు సమకూర్చింది. దాంతో టిఎస్ ఐఐసీ పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసి పరిశ్రమలకి ఇస్తుంది. అందుకుగాను ఆ పరిశ్రమలు టిఎస్ ఐఐసీకి సొమ్ము చెల్లిస్తాయి. దానినే టిఎస్ ఐఐసీకి బ్యాంకులకి తిరిగి చెల్లిస్తుంది.

అయితే మద్యలో ప్రభుత్వం ఉన్నందున ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు టిఎస్ ఐఐసీ అప్పులను ప్రభుత్వమే తీరుస్తుంటుంది. టిఎస్ ఐఐసీకి ఆదాయం సమకోరిన తర్వాత ప్రభుత్వం చెల్లించిన  ఆ సొమ్ముని తిరిగి ఇచ్చేస్తుంది. కనుక టిఎస్ ఐఐసీ అప్పులు, వాటి చెల్లింపుల గురించి అబద్దం చెప్పాల్సిన అవసరం మాకు లేదు,” అని సమాధానం చెప్పారు. 

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, గత 9 ఏళ్ళలో తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో కొత్తగా నిర్మించిన రోడ్లు, ఫ్లైఓవర్లు, సచివాలయం వంటి భవనాలు సమీకృత కలెక్టర్ కార్యాలయాల జాబితాని చదివి వినిపించి, మీరు కేవలం మేము చేసిన అప్పుల గురించి మాత్రమే చెపుతున్నారు తప్ప మేము చేసిన ఈ అభివృద్ధి పనుల గురించి చెప్పడం లేదు. తద్వారా మా పాలనలో రాష్ట్రంలో ఏదో అనర్ధాలు జరిగిపోయాయన్నట్లు మీరు ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు,” అని విమర్శించారు.