ఎవరైనా సమస్యల కారణంగా జీవితంలో నష్టపోతే ‘ఇక వారి బ్రతుకు బస్టాండే’ అంటారు. కానీ ఇప్పుడు అలాగ అనుకోవడానికి కూడా వీలులేకుండా చేయబోతున్నారు ఆర్టీసీ అధికారులు. రైల్వేశాఖ చిరకాలంగా ప్లాట్ ఫారం టికెట్స్ అమ్మకాల ద్వారా ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. అదే విధంగా రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్లలో కూడా ప్లాట్ ఫారం టికెట్స్ ప్రవేశపెట్టి తమ ఆదాయాన్ని పెంచుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారని తాజా సమాచారం. నష్టాలలో ఉన్న ఆర్టీసిని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదివరకే అనేక మంచి సూచనలు చేశారు. వాటిలో ఈ సూచనలేదు. ఇది ఆర్టీసీ అధికారులకి కలిగిన ఆలోచన. రాష్ట్రంలో రోజూ లక్షలాది మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుంటారు. వారిని బస్సులలో ఎక్కించేందుకు లేదా రిసీవ్ చేసుకోనేందుకు అనేక వేలమంది వస్తుంటారు. కనుక ఆర్టీసీ బస్టాండ్లలో కూడా ప్లాట్ ఫారం టికెట్స్ ప్రవేశపెట్టిన్నట్లయితే బారీగా ఆదాయం సమకూర్చుకొని తమ నష్టాలని కొంతమేర తగ్గించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ముందుగా హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీం నగర్ జిల్లాలలో ఉన్న ప్రధాన బస్టాండ్లలో ఈ ప్లాట్ ఫారం టికెట్ విధానం అమలుచేసి చూడాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో బస్టాండ్లని రెండు లేదా మూడు కేటగిరీలుగా విభజించి తదనుగుణంగా ప్లాట్ ఫారం టికెట్ ధరలు నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ప్లాట్ ఫారం టికెట్ ధర రూ.5గా నిర్ణయించాలని భావిస్తున్నాట్లు సమాచారం. దీని అమలులో సాధకబాధకాల గురించి అధికారులు అధ్యయనం చేస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్లాట్ ఫారం టికెట్ విధానం అమలుచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.