సుమారు రెండేళ్ళ క్రితం జరిగిన డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కొమ్ములు తిరిగిన కాంగ్రెస్, భాజపాలని ఆమాద్మీ పార్టీ చీపురుతో ఊడ్చి పారేసి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి మోడీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తూనే ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా మోడీ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటంతో ఆ రెండు పార్టీల మద్య అప్పటి నుంచే ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతోంది.
ఆమాద్మీ ప్రభుత్వం ఆదేశాల మేరకే పనిచేయవలసిన డిల్లీ పోలీసులు, ఈ రెండేళ్ళలో చాలా మంది ఆమాద్మీ ఎమ్మెల్యేలపై ఏదో ఒక కేసు పెడుతూ కోర్టుల చుట్టూ తిప్పిస్తూనే ఉండటం విశేషం. ఇప్పటికే అరడజను మందికిపైగా ఎమ్మెల్యేలు ఫేస్ బుక్ అయిపోయారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నోటిదురదతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేసినందుకు పరువునష్టం కేసులో కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఒక్కో ఎమ్మెల్యేని ఏరుకొంటూ వెళ్తే చాలా కాలం పట్టేస్తుందని మోడీ ప్రభుత్వం భావించిందో ఏమో ఒకేసారి 27మందిని లేపేసేందుకు మంచి ఎత్తుగడ వేసింది.
ఆమాద్మీ పార్టీకి చెందిన 27మంది ఎమ్మెల్యేలకి అరవింద్ కేజ్రీవాల్ వివిధ సంస్థలకి చైర్మన్ పదవులు కట్టబెట్టారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు లాభోపేతమైన పదవులలో కొనసాగడం చట్ట వ్యతిరేకం అంటూ కొందరు నేరుగా రాష్ట్రపతికే పిర్యాదు చేశారు. వారిని భాజపాయే ప్రోత్సహించిందని ఆమాద్మీ పార్టీ వాదిస్తుంది. ప్రస్తుతం అన్ని రాజకీయపార్టీలు ఇదే విధానం అవలంభిస్తున్నాయి కనుక ఆమాద్మీ వాదనని కొట్టిపారేయలేము.
రాష్ట్రపతి కార్యాలయం వారి పిర్యాదుని ఈసీకి పంపడం, ఈసీ వెంటనే స్పందించి ఆ 27మంది ఎమ్మెల్యేలని అనర్హులుగా ఎందుకు ప్రకటించకూడదో 10 రోజుల్లోగా తెలియజేయమంటూ చకచకా నోటీసులు పంపడం జరిగిపోయింది. ఒకవేళ వారిపై అనర్హత వేటు వేస్తే, డిల్లీలోని ఆమాద్మీ ప్రభుత్వం ఒకేసారి కుప్పకూలిపోతుంది. అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లయితే అందరూ గంపగుత్తగా భాజపాలో చేరిపోయినా ఆశ్చర్యం లేదు. కనుక భాజపా వేసిన ఈ పాచిక పారుతుందో లేదో తెలియాలంటే నవంబర్ 11వరకు వేచి చూడక తప్పదు.