పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ ని పాకిస్తాన్ అంగీకరించనప్పటికీ, ఆ కారణంగానే భారత్ పై తీవ్ర ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. గత రెండు నెలలుగా నిత్యం సరిహద్దులలో పాక్ సైనికులు భారత్ సరిహద్దు గ్రామాలపై, సైనికులపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. భారత్ సైనికులు కూడా వారికి చాలా గట్టిగానే బదులిస్తున్నారు. భారత్ సైనికుల చేతిలో కొన్ని రోజుల క్రితం 15 మంది పాక్ సైనికులు మరణించారు. నిత్యం ఒకరో ఇద్దరో ఉగ్రవాదులు భారత్ సైనికుల చేతిలో హతం అవుతూనే ఉన్నారు. అయినప్పటికీ పాక్ వెనుకంజ వేయకుండా ఇంకా రెచ్చిపోతూనే ఉంది. పాక్ సైనికుల కాల్పులలో నిన్న ఏకంగా 8మంది భారత్ పౌరులు మృతి చెందడంతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ తక్షణమే కాల్పులు నిలిపివేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. కానీ అటువంటి హెచ్చరికలకి భయపడితే అది పాకిస్తాన్ ఎందుకవుతుంది? అందుకే సరిహద్దులలో పాక్ సైనికులు కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నారు.
సరిహద్దులలో నెలకొన్న ఈ యుద్ద వాతావరణంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు రక్షణ మంత్రి మనోహర్ పార్రికర్, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇప్పుడు భారత్ పై కాల్పులు జరుపుతున్నది పాక్ సైనికులు కనుక వారిపై బారీ ఆయుధాలతో దాడికి దిగితే అది ఇరు దేశాల మద్య ప్రత్యక్ష యుద్దానికి దారి తీయవచ్చు. కానీ భారత్ హెచ్చరికలని ఏ మాత్రం ఖాతరు చేయని పాకిస్తాన్ని అత్యవసరంగా కట్టడి చేయవలసి ఉంది. లేకుంటే సరిహద్దు గ్రామాలలో ప్రజలు ఇక నివసించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక పాకిస్తాన్ని కట్టడి చేసేందుకు ఈసారి మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొంటుందో చూడాలి.