ఏపి కాపీ కొట్టి ఫస్ట్ ర్యాంక్ సాధించిందా?

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెంటికీ నెంబర్: 1స్థానం దక్కడంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖఖా మంత్రి కెటిఆర్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచంలో ఒకరి మేధో సంపత్తిని మరొకరు తమదిగా చెప్పుకోవడం చాలా కాలంగా జరుగుతున్నదే. గత ఏడాది తెలంగాణా ప్రభుత్వ విధానాలని ఏపి ప్రభుత్వం కాపీ కొట్టి తనవిగా చెప్పుకొన్నప్పుడు మేము వెంటనే కేంద్రానికి పిర్యాదు చేశాము. ఈసారి కూడా అదే జరిగింది. అయినా నెంబర్: 1స్థానాన్ని వేరెవరితోనో పంచుకోవడం కంటే సాటి తెలుగు రాష్ట్రంతో పంచుకోవడమే మాకు ఆనందం కలిగిస్తుంది. ఒకవేళ కేంద్రం అడిగినా మేము అదే చెప్పేవాళ్ళం. ఎంతైనా అందరం ఇంతకాలం కలిసే ఉన్నాము కదా,” అని అన్నారు. 

ఏపి ప్రభుత్వం తమ విధానాలని కాపీ కొట్టి నెంబర్: 1స్థానం  దక్కించుకొందని కెటిఆర్ ఆరోపించడం చాలా తీవ్రమైన విషయమే. ఒకవేళ ఏపి సర్కార్ నిజంగా ఆవిధంగా చేసి ఉండి ఉంటే దాని వలన ఆ రాష్ట్రానికే నష్టం కలుగుతుంది. ఎందుకంటే, లేని అభివృద్ధిని ఉన్నట్లు చూపిస్తే ప్రజలని మభ్యపెట్టవచ్చునేమో కానీ పారిశ్రామికవేత్తలని మభ్యపెట్టడం సాధ్యం కాదు. కానీ గత రెండున్నరేళ్ళలో కేంద్రం సహకారంతో ఏపిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని గమనించినట్లయితే, కెటిఆర్ ఆరోపణలు నమ్మశక్యంగా కనిపించవు. ఏపిలో సగటున ప్రతీనెలకి ఒకటైనా ఒక బారీ ప్రాజెక్టుకి శంఖుస్థాపనలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఏపి పూర్తిగా చితికిపోయినప్పటికీ, రెండున్నరేళ్ళలోనే మళ్ళీ కోలుకొని లేచి నిలబడగలిగింది. కనుక అది సరైన దిశలోనే పయనిస్తున్నట్లు భావించవచ్చు. ఒకవేళ మంత్రి కెటిఆర్ చెపుతున్నట్లుగా అది నిజంగానే ఈ ర్యాంకుల కోసం తెలంగాణా విధానాలని కాపీ కొట్టి ఉండి ఉంటే అది మనకీ గర్వకారణమే కదా?