తెరాస సర్కార్ కి హైకోర్టులో మళ్ళీ ఎదురుదెబ్బ

తెరాస సర్కార్ కి హైకోర్టులో ఎదురుదెబ్బలు తినడం పరిపాటిగా మారిపోయింది. ఈరోజు మళ్ళీ మరోమారు ఎదురుదెబ్బ తింది. ప్రస్తుతం ఉన్న సచివాలయానికి వాస్తు దోషాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్న కారణంగా ఆయన దానిని కూల్చివేసి, దాని స్థానంలో కొత్తగా 10 అంతస్తుల భవనం నిర్మించాలనుకొంటున్నారు. ఆయన నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. వాస్తు పేరిట ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాధనం దుర్విఇయోగం చేస్తున్నారని, కనుక సచివాలయం కూల్చివేతని అడ్డుకోవలసిందిగా వారు తమ పిటిషన్ ద్వారా హైకోర్టుని అభ్యర్ధించారు. దానిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు, సచివాలయం ఎందుకు కూల్చివేయాలనుకొంటున్నారో 10 రోజులలోగా తెలియజేయాలంటూ తెరాస సర్కార్ కి నోటీస్ జారీ చేసి కేసుని రెండు వారాలకి వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయం భవనాలని కూల్చవద్దని స్టే ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. 

ఒకవైపు సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే విదిన్చాగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయంలో తన అధీనంలో ఉన్న భవనాలని తెరాస సర్కార్ కి అప్పగించేందుకు నిరాకరించింది. తెరాస సర్కార్ కి ఇది ఎంతమాత్రం గౌరవప్రదం కాదని చెప్పక తప్పదు. కానీ చేతులు కాలిన తరువాత ఇప్పుడు ఆకులు పట్టుకొని ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. రాష్ట్రంలో కొమ్ములు తిరిగిన ప్రతిపక్ష నేతలని తన రాజకీయ చతురతతో మట్టి కరిపించిన కెసిఆర్, ఈ విషయంలో ఇటువంటి పరిణామాలని ముందే ఊహించలేకపోయారంటే నమ్మశక్యంగా లేదు.