ఇటీవల భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో తమకి కాపలాగా ఉన్న రామ్ శంకర్ అనే పోలీస్ ని తమ వద్ద ఉన్న కంచంతో అతిదారుణంగా గొంతుకోసి చంపారు. ఆ తరువాత వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన రామ్ శంకర్ అంత్యక్రియలకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరవడమే కాకుండా స్వయంగా పాడె మోసి అంత్యక్రియలలో పాల్గొని చనిపోయిన పోలీస్ ఉద్యోగిపట్ల చాలా గౌరవం ప్రదర్శించారు. రామ్ శంకర్ కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. రామ్ శంకర్ కుమార్త్ వివాహం మరికొద్ది రోజులలో జరుగవలసిఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలో అయన మరణించడంతో ఆమె వివాహం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకొన్న ముఖ్యమంత్రి రామ్ శంకర్ కుమార్తె వివాహానికి అదనంగా మరో రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ “మన దేశంలో కొందరు రాజకీయనేతలు ఎంతగా దిగజారిపోయారంటే, విధినిర్వహణలో ఉండగా ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన పోలీస్ కానిస్టేబుల్ రామ్ శంకర్ మరణం గురించి వారు ఏమాత్రం బాధ వ్యక్తం చేయలేదు. కానీ అతనిని అతికిరాతకంగా హత్య చేసి జైలు నుంచి తప్పించుకొని పారిపోయిన ఉగ్రవాదులని ఎన్కౌంటర్ గురించి చాలా బాధపడిపోతున్నారు,” అని అన్నారు.
నిజమే! ఒక ఉగ్రవాది లేదా మావోయిష్టు మరణిస్తే మన రాజకీయ నాయకులు మీడియా ముందుకు వచ్చి చాలా ఆవేశంగా మాట్లాడుతుంటారు. ఆంధ్రా-ఓడిశా సరిహద్దుల వద్ద మావోయిస్ట్ లు ఎన్కౌంటర్ అయితే వారికోసం ప్రజా సంఘాలు న్యాయపోరాటాలు చేస్తున్నాయి. ఒక ఉగ్రవాదిపై ప్రభుత్వం చర్యలు తీసుకొంటే దిగ్విజయ్ సింగ్, అసదుద్దీన్ ఒవైసీ వంటివారు చాలా ఆవేశంగా మాట్లాడుతుంటారు. కానీ విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ లేదాపోలీస్ అధికారి లేదా ఒక సైనికుడు చనిపోతే వారి కోసం ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. మన రాజకీయ నాయకులకి ఎల్లప్పుడూ ఓటు బ్యాంక్ రాజకీయాలపైనే దృష్టి ఉంటుంది తప్ప దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేస్తున్న మన పోలీసులు, సైనికులు కనబడరు.