రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలలో వైకాపా కూడ ఒకటి కానీ అది ఎన్నడూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడదు. కనీసం తన ఉనికిని చాటుకొనేందుకైనా ప్రయత్నించదు. పనిచేయని ఆ పార్టీలో ఎప్పుడూ ఏవో నియామకాలు జరుగుతూనే ఉండటమే విశేషం. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణా వైకాపా ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ జిల్లాకి చెందిన మీర్జా ఆజం అలీని, అదిలాబాద్ జిల్లా పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా ఎం.గంగన్నని నియమిస్తున్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెదేపా, భాజపా, సిపిఎం పార్టీలు ప్రజాసమస్యలపై నిత్యం తెలంగాణా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటాయి. అటువంటి పార్టీలే ప్రజలని ఆకట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నాయి. కానీ ఏనాడూ ప్రజల కోసం నోరు విప్పని వైకాపా తరచూ నియామకాలు చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఈ పదవులని ఎరగా వేసి రాజకీయాలలో ఉన్నవారిని పార్టీలోకి ఆకర్షించుతూ పార్టీని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లుంది. కానీ అది ఏమి ఆశించి పార్టీని సజీవంగా ఉంచుతోందో?