మా ఆయన ఆచూకి చెప్పండి: పద్మక్క

ఆంధ్రా-ఓడిశా సరిహద్దులో మావోయిష్టుల ఎన్కౌంటర్ జరిగిన తరువాత నుంచి వారి అగ్రనేత రామకృష్ణ కనబడకపోవడంతో ఆయన భార్య శిరీష అలియాస్ పద్మక్క సోమవారం హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తన భర్త ఆంధ్రా పోలీసుల అధీనంలోనే ఉన్నాడని భావిస్తున్నానని, కనుక ఆయన ఆచూకీ తెలియజేయాలని పిటిషన్ ద్వారా ఆమె కోర్టుని కోరారు. ఆమె పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీస్ పంపింది. రామకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడా లేడా? అనే విషయం తెలియజేయవలసిందిగా ఆదేశించి, ఈ కేసుని గురువారానికి వాయిదా వేసింది. 

రామకృష్ణ కానీ మరే ఇతర మావోయిస్ట్ అగ్రనేతలు గానీ తమ వద్ద లేరని విశాఖ జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ స్పష్టం చేశారు. అతని కోసం ఎన్కౌంటర్ జరిగిన బలిమెల ప్రాంతంలో గ్రేహౌండ్ దళాలు రెండు రోజులు గాలింపు చర్యలు కూడా చేపట్టాయి కానీ ఎవరూ పట్టుబడలేదు. కనుక రామకృష్ణ తమ అదుపులో లేడని పోలీసులు పదేపదే చెపుతున్నారు. కానీ పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు రామకృష్ణ పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతనిని కూడా పోలీసులు రహస్యంగా ఎన్కౌంటర్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అతను తమ అదుపులో లేడని విశాఖ జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ చెప్పినందున, గురువారం ఈ కేసుని కోర్టు మళ్ళీ విచారణకి చేపట్టినప్పుడు కూడా బహుశః అదేవిధంగా చెప్పవచ్చు. ఆయన ఒకవేళ గాయపడి తప్పించుకొని ఉంటే తన అనుచరులకో, భార్యకో లేదా శ్రేయోభిలాషులకో తప్పకుండా ఫోన్ చేసి ఉండేవారు. కానీ అయన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఫోన్ కాల్ రాకపోవడం చేతనే అయన పోలీసుల అదుపులో ఉన్నాడని మావోయిష్టులు అనుమానిస్తున్నారు. కానీ పోలీసులు అతను తమ వద్ద లేడని చెపుతున్నారు. కనుక రామకృష్ణ ఏమయ్యాడనే విషయం పెద్ద మిస్టరీగా మారింది.

ఈ విషయంపై ప్రొఫెసర్ కోదండరాం స్పందిస్తూ ఒకవేళ పోలీసుల అదుపులో మావోయిష్టులు ఉన్నట్లయితే వారినందరినీ తక్షణం కోర్టులో హాజరుపరచాలి,” అని అన్నారు.