ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకి ఫస్ట్ ర్యాంక్స్

కేంద్రవాణిజ్య శాఖ ప్రతీ ఏటా ప్రకటించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డులలో గత ఏడాది 13వ స్థానంలో ఉన్న తెలంగాణా రాష్ట్రం, ఈ ఏడాది నెంబర్: 1 స్థానం సంపాదించుకొంది. తెలంగాణాతో బాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సరిసమానంగా 98.78 మార్కులు సంపాదించుకోవడంతో, ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకి నెంబర్: 1 ర్యాంక్ ఇస్తున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి నిర్మల సీతారామన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. తరువాత స్థానాలలో గుజరాత్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. 

వీటిలో పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన మహారాష్ట్రా, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్  రాష్ట్రాలు వెనుకబడిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

కర్నాటక, యూపి, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు వర్ధమాన రాష్ట్రాలుగా, తమిళనాడు, డిల్లీలు  ఇంకా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రాల గ్రూప్ లో ఉండటం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

దేశంలో వివిధ రాష్ట్రాలలో పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో అభివృద్ధి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, సంస్కరణల ఆధారంగా అనేక అంశాలని  పరిశీలించి కేంద్ర వాణిజ్యశాఖ ఈ ర్యాంకులు ఇస్తుంటుంది. దానిలో రెండు తెలుగు రాష్ట్రాలు నూటికి 98.78 మార్కులు సంపాదించుకొని ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాయి. రాష్ట్ర విభజన కారణంగా రెండు రాష్ట్రాలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, చాలా కాలం క్రితమే మంచి పారిశ్రామిక అభివృద్ధిని సాధించి, ఆర్ధికంగా నిలద్రొక్కుకొన్న రాష్ట్రాలకంటే ముందుకు దూసుకుపోవడం హర్షణీయం. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ విభేధాలని, ఇతర సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకొని ఒకదానికొకటి సహకరించుకొన్నట్లయితే ఇంకా వేగంగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి.