భోపాల్ జైలు నుంచి ఉగ్రవాదులు పరారి

ఒకరు ఇద్దరూ కాదు ఏకంగా 8మంది కరుడుగట్టిన సిమీ (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా) ఉగ్రవాదులు ఈరోజు తెల్లవారుజామున మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ జైలు నుంచి తప్పించుకొన్నారు. వారు రామ్ శంకర్ అనే సెక్యూరిటీ గార్డుని హత్య చేసి గోడ దూకి తప్పించుకొని పారిపోయారు. తమ వద్ద ఉన్న కంచంతో రామ్ శంకర్ గొంతు కోసి, దుప్పట్లని తాడులాగ తయారుచేసుకొని చాలా ఎత్తున్న జైలు గోడ దూకి పారిపోయారు.

ఈ సంగతి తెలిసిన వెంటనే వారి కోసం పోలీసులు నగరంలో బస్టాండులు, రైల్వే స్టేషన్, జాతీయ రహదారులలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిపై విచారణకి ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. విశేషం ఏమిటంటే భోపాల్ జైలు ప్రధానద్వారంపైన ఐ.ఎస్.ఓ.14001-2004, ఐ.ఎస్.ఓ.9001-2000 ప్రమాణాలు కలిగినట్లు పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉంది. అటువంటి   కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన భోపాల్ జైలు నుంచి 8మంది ఉగ్రవాదులు తప్పించుకొనిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

తాజా సమాచారం:  జైలు నుంచి తప్పించుకొని పారిపోయిన 8 మంది సిమీ ఉగ్రవాదులని భోపాల్ కి సుమారు 10 కిమీ దూరంలో శివారు ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీస్ దళాలు అక్కడికి చేరుకొని వారిని చుట్టుముట్టాయి. వారు ఎదురుతిరగడంతో వారిపై కాల్పులు జరుపగా అందరూ మృతి చెందారు. ఎన్కౌంటర్ లో మరణించిన వారిలో అంజద్ ఖాన్, మహబూబ్‌, మజీద్, మజీబ్ షేక్, సాలిక్, జకీర్ నాయక్, ఖలీద్, అఖిల్ లుగా పోలీసులు గుర్తించారు. వారందరూ ఈ రోజు తెల్లవారు జామున భోపాల్ జైలు నుంచి తప్పించుకొన్న సిమీ ఉగ్రవాదులేనని దృవీకరించారు. వారి శవాలని పోస్ట్ మారటం కోసం ఆసుపత్రికి తరలించారు.