తెరాస ఎమ్మెల్యే పుట్ట మధు అన్నంత పనీ చేశారు. మాజీ కాంగ్రెస్ మంత్రి డి. శ్రీధర్ బాబుకి నయీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించడమే కాకుండా, ఆయనపై ముఖ్యమంత్రి కెసిఆర్ కి, డిజిపి అనురాగ్ శర్మకి పిర్యాదు కూడా చేస్తానని హెచ్చరించారు. చెప్పినట్లుగానే నిన్నడిజిపి అనురాగ్ శర్మని కలిసి శ్రీధర్ బాబుపై పిర్యాదు చేశారు. అతనికి నయీంతో సంబంధాలు ఉన్నాయని నిరూపించదానికి తన వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. శ్రీధర్ బాబుపై సిట్ అధికారులు దర్యాప్తు చేసినట్లయితే, వారికి ఆ ఆధారాలు అందిస్తానని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ ని కూడా కలుసుకొని, శ్రీధర్ బాబుపై విచారణ జరిపించవలసిందిగా కోరుతానని మధు చెప్పారు. పిర్యాదు చేసింది అధికార పార్టీ ఎమ్మెల్యే కనుక డిజిపి దర్యాప్తుకి ఆదేశించవచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు వస్తే ఇంక తిరుగు ఉండదు.
అయితే శ్రీధర్ బాబు మధు చేస్తున్న ఆరోపణలని ఖండించారు. తనకి నయీంతో ఎటువంటి సంబంధం లేదని, తెరాస సర్కార్ కి ధైర్యం ఉంటే సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని సవాల్ విసిరారు. సిబిఐ చేత దర్యాప్తు చేయిస్తే, అధికార పార్టీ నేతల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంటుంది కనుకనే అందుకు అంగీకరించడం లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.