సిద్దూకి హై డిమాండ్!

చదరంగంలో ఆటగాళ్ళు ఒకేసారి నలుగురు ఐదుగురు ప్రత్యర్ధులతో ఆడుతూ తమ ప్రతిభ చూపుతుంటారు. కానీ మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు కూడా ఒకేసారి రెండు రాజకీయ పార్టీలతో గేమ్స్ ఆడుతూ తన ప్రతిభని చాటుకొంటున్నారు. ఆయన భాజపా నుంచి బయటకి వచ్చేసి ఆవాజ్-ఏ-పంజాబ్ అనే స్వంత పార్టీ పెట్టుకొన్నాక, పంజాబ్ లోని అధికార అకాలీదళ్, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీల నేతలని తన పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ లేదా ఆమాద్మీ పార్టీలలో దేనిలో ఒకదానిలో చేరిపోయే ఆలోచనలు చేస్తున్నారు. తమ పార్టీలో చేరినట్లయితే ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆయనకి గాలం వేస్తుంటే దానితో సంప్రదింపులు జరుపుతూనే మరోపక్క నిన్న రాత్రి ఆమాద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో కూడా చర్చలు జరిపారు. 

ఆయన దీపావళి రోజున కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు నిన్ననే ఆ పార్టీ నేత ప్రకటించారు. కానీ నిన్న రాత్రే సిద్దూ అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం అవడం విశేషం. ఆమాద్మీలో జేరితే తనకి ఉప ముఖ్యమంత్రి పదవి, కనీసం 7-8 ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వాలని సిద్దూ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 

వచ్చే ఏడాది జరుగబోయే పంజాబ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు రెంటికీ విజయావకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకి బయటిమద్దతు అవసరం పడవచ్చని తాజా సర్వేలు స్పష్టం చేయడంతో ఆ రెండు పార్టీలు సిద్దూ వెంటపడుతున్నాయి. 

మొదట ఉప ముఖ్యమంత్రి పదవి దక్కితే చాలనుకొన్న సిద్దూ ఇప్పుడు తనకి మంచి డిమాండ్ ఉందని గుర్తించడంతో ఇదే అదునుగా తన కోర్కెల చిట్టాని కూడా పెంచుకొంటూపోతున్నాడు. ఒకేసారి రెండు  పార్టీలని లైన్ లో ఉంచి బేరాలు ఆడుతున్నాడు. సిద్దూ అత్యాశకి పోయి అందిన అవకాశాలు పాడుచేసుకొంటాడో లేక సద్వినియోగం చేసుకొంటాడో చూడాలి.