ఓటుకి నోటు కేసులో మళ్ళీ కదలికలు వచ్చాయి. అయితే అది తెరాస సర్కార్ జోక్యం వలన వచ్చినవి కావు. వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ కేసుని మళ్ళీ కెలికినందున వచ్చిన కదలికలు అవి. ఆయన పిటిషన్ పై రెండు నెలల క్రితం ఆయన వేసిన పిటిషన్ పై సానుకూలంగా స్పందించిన ఎసిబి న్యాయస్థానం, ఆ కేసుని పునర్విచారణ చేయాలని ఆదేశించడంతో ఏసిబి అధికారులు దానిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రని కూడా దర్యాప్తు చేస్తామని చెప్పడంతో ఆయన అప్రమత్తం అయ్యారు.
ఆ కేసుతో తనకి సంబంధం లేదని కనుక తనపై విచారణ నిలిపివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై హైకోర్టు 8 వారాలు స్టే విదించగా, దానిని సవాలు చేస్తూ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఆ గడువును నాలుగువారాలకి కుదించింది. ఈరోజు హైకోర్టులో ఆ కేసు విచారణకి వచ్చింది.
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది లూద్రా వాదించారు. ఆయన వాదనలు విన్న తరువాత ఈ కేసుని సోమవారానికి వాయిదా వేసింది. ఒకవేళ హైకోర్టు ఆయన వాదనలతో ఏకీభవించి కేసుని కొట్టేసినా, ఏసిబి విచారణపై స్టే విధించినా రామకృష్ణారెడ్డి మళ్ళీ రంగంలోకి దిగి సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. ఒకవేళ చంద్రబాబుపై విచారణకి ఏసిబికి అనుమతిస్తే అప్పుడు ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. ఏవిధంగా చూసినా, ఈ కేసు హైకోర్టులో తేలేది కాదని స్పష్టం అవుతోంది.