తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి మళ్ళీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలని కూల్చివేసి వాటి స్థానంలో రూ.150 కోట్లు ఖర్చు చేసి 10 అంతస్తులతో కూడిన కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కెసిఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆయన నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈరోజు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వాస్తు పేరుతో ప్రజాధనం తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారని, కనుక సచివాలయం కూల్చివేతని అడ్డుకోవలసిందిగా వారు తమ పిటిషన్ లో కోరారు. వారి పిటిషన్ని హైకోర్టు విచారణకి స్వీకరించింది. దానిపై రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
గతంలో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఉస్మానియా ఆసుపత్రిని, ఎర్రగడ్డ ఆసుపత్రిని, దాని పక్కనే ఉన్న చారిత్రిక కట్టడాలని కూల్చివేయాలనుకొన్నప్పుడు, ప్రతిపక్షాలు గట్టిగా అభ్యంతరాలు చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు సచివాలయం కూల్చివేతకి ఆయన సిద్దం అవడంతో ప్రతిపక్షాలు హైకోర్టుని ఆశ్రయించాయి.
ఒకవేళ హైకోర్టు కూడా కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే అది ఆయనకి గౌరవప్రదం కాబోదు. ఒకవేళ హైకోర్టు ఆ వ్యవహారంలో కలుగజేసుకొనేందుకు అంగీకరించకపోయినా, రాష్ట్రంలో ప్రతిపక్షాలు సచివాలయం కూల్చివేతని ఒక పెద్ద విషయంగా తీసుకొని పోరాటాలు మొదలుపెట్టినా వాటి వలన కూడా తెరాస సర్కార్ కి అప్రతిష్ట తప్పదు. కనుక ఈ వ్యవహారంలో కొంచెం ఆచితూచి అడుగు వేస్తే మంచిదేమో?