సిద్దూ మానవబాంబు వంటివాడుట!

వచ్చే ఏడాదిలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో, యూపిలో భాజపా, పంజాబ్ లో కాంగ్రెస్ లేదా ఆమాద్మీ పార్టీలకి విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు తేల్చడంతో, కనీసం పంజాబ్ లో అయినా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం పట్టుదలగా ఉంది. అందుకే అది నవజ్యోత్ సింగ్ సిద్దుకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఆశ జూపించి, పార్టీలో చేర్చుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. సిద్ధూ కూడా ఆ పదవి కోసమే ఆశపడుతూ స్వంత కుంపటి పెట్టుకొన్నాడు కానీ సర్వేలలో అతని పార్టీ ఊసే వినబడలేదు. దానితో ఆయన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఈ బంపర్ పండుగ ఆఫర్ ని పుచ్చుకొని, దీపావళి పండుగ రోజునే ఆ పార్టీలో చేరిపోయేందుకు సిద్దం అవుతున్నారుట! 

ఈ విషయం కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా స్వయంగా ప్రకటించారు. సిద్ధూ స్వంత కుంపటి పెట్టుకోవడం, నెల తిరక్కుండా అది పార్టీ కాదు కూటమి అని ప్రకటించడం, మళ్ళీ ఆ కూటమిని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపేయాలనుకోవడం అన్నీ చాలా విచిత్రమనుకొంటే, పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ సిద్దూ గురించి చేసిన వ్యాఖ్యలు మరీ విచిత్రంగా ఉన్నాయి.

“సిద్దూ ఒక మానవబాంబు వంటివాడు. అతను కాంగ్రెస్ పార్టీలో చేరితే దానిని పేల్చేస్తాడు. పంజాబ్ పిసిసి అధ్యక్షుడు అమరీందర్ సింగ్, ప్రతాప్ సింగ్ బాజ్వా, సిద్దూ ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీని ముంచేయడం గ్యారంటీ,” అని అన్నారు. “సిద్దూ దీపావళి కానుక వంటివాడు” అని ప్రతాప్ సింగ్ బాజ్వా చెప్పడం చూస్తే సుఖ్ బీర్ సింగ్ అభిప్రాయం నిజమేనేమో అనిపించకమానదు. 

మరి విజయావకాశాలున్న కాంగ్రెస్ పార్టీని సిద్దూ పేల్చేయడానికే ఆ పార్టీలో చేరుతున్నాడో లేకపోతే దానికి సహకరించి ముఖ్యమంత్రి కావాలనే తన నెరవేర్చుకొంటాడో ఎన్నికలలోగానే తేలిపోవచ్చు. కానీ అంత నిలకడ, నమ్మకంలేని సిద్దూ వంటి రాజకీయ నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదేమో? ఆలోచిస్తే బాగుంటుంది.