పవన్ కళ్యాణ్ ప్రత్యేక సభ వివరాలు

ఏపికి ప్రత్యేకహోదా కోరుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన పోరాటంలో భాగంగా గత నెల కాకినాడలో ఒక సభ నిర్వహించారు. మళ్ళీ వచ్చే నెల 10న అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దానికి 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ' అని పేరు పెట్టారు. అనంతపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకి సభ నిర్వహిస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. ఇతర రాజకీయపార్టీలు నిర్వహించే బహిరంగ సభలకి జనసమీకరణ చేయవలసి వస్తుంది కానీ జనసేనాని సభకి ఎన్నడూ ఆ అవసరం ఏర్పడలేదు. ఆయన ఫలాన చోట సభ నిర్వహించబోతున్నట్లు ట్వీటర్ లో ఒక చిన్న మెసేజ్ పెడితే, ఆయన అభిమానులే అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసేసి, రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా స్వచ్చందంగా తరలివస్తుంటారు. అది కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే చెల్లునని చెప్పవచ్చు. 

కానీ అయన ప్రత్యేక హోదా సాధించే విషయంలో చాలా అగమ్యంగా సాగుతున్నట్లు కనబడుతోంది. ఆయన సభలో చేసిన ప్రసంగాలు విన్నట్లయితే ఆ విషయం అర్ధం అవుతుంది. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తుందని ప్రకటించారు కనుక ఈ సభల ద్వారా ఆయన ప్రజలని ఆకట్టుకోవాలనుకొంటున్నట్లయితే, అదీ సక్రమంగా చేయలేకపోతున్నట్లు కనిపిస్తోంది. కనుక ఇటువంటి సభలు నిర్వహించడం కంటే ముందుగా అయన తన పార్టీని నిర్మించుకొన్నట్లయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఆయన అభిమానులు కూడా చాలా సంతోషిస్తారు. మొదట పార్టీకి ఒక రూపురేఖలు ఇచ్చినట్లయితే, అప్పుడు అదే ఆయనకి సరైన దిశానిర్దేశం చేస్తుంది. ఆయనకి చాలా అండగా నిలబడుతుంది. పార్టీ లేకుండా, ఎటువంటి పోరాటాలు చేయకుండా ప్రత్యేక హోదా సాధించాలనుకోవడం సరైన ఆలోచనకాదనే చెప్పవచ్చు. ఆవిధంగా ముందుకు సాగడం వలన కొత్త సమస్యలని, శత్రువులని సృష్టించుకొన్నట్లు అవుతోంది తప్ప ఆశించిన ప్రయోజనం కనబడదు.