వారి సంగతి తేల్చండి స్పీకర్ జీ!

రాష్ట్రంలో కాంగ్రెస్, తెదేపా, వైకాపాల నుంచి తెరాసలోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోదలచుకొన్నారో నవంబర్ 8లోగా తెలియజేయాలని సుప్రీంకోర్టు తెలంగాణా శాసనసభ స్పీకర్ మధుసూధనాచారిని కోరింది. ఆ మూడు పార్టీల నుంచి 25మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. కానీ వారిలో ఎవరూ నేటి వరకు కూడా తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేయలేదు. వారిలో తెదేపా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేస్తున్నారు.

ఆ మూడు పార్టీల ప్రతినిధులు స్పీకర్ కి, గవర్నర్ కి కలిసి వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ విజ్ఞప్తి పత్రాలు ఇచ్చినా వారిరువురూ స్పందించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయబడింది. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, స్పీకర్ కి ఈ ఆదేశాలు జారీ చేసింది.

సాధారణంగా స్పీకర్ పరిధిలో ఉండే ఇటువంటి వ్యవహారంలో చట్టప్రకారం న్యాయస్థానాలు కల్పించుకోవడానికి వీలులేదు. అందుకే హైకోర్టు కూడా ఈవిషయంలో స్పీకర్ పై గట్టిగా ఒత్తిడి చేయలేకపోయింది. సుప్రీంకోర్టుకైనా అదే నియమం వర్తిస్తుంది కనుక తన పరిధిలో ఉన్న వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం తగదని స్పీకర్పు చెపుతారా లేక వారిపై చర్యలు తీసుకొనేందుకు సిద్దపడతారా చూడాలి.

 ఒకవేళ వారిపై చర్యలు తీసుకోవడం అనివార్యం అయితే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో తెదేపా ప్రభుత్వంపై కూడా పడుతుంది. ఎందుకంటే, అది కూడా 20 మంది వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలో చేర్చుకొంది. వారు కూడా నేటికీ వైకాపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు.