నయీంతో సంబంధాలు లేవు: మాజీ మంత్రి

మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబుకి ఎన్కౌంటర్ లో హతమయిన నయీంతో సంబంధాలు ఉండేవని మంధని తెరాస ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శ్రీధర్ బాబుపై ఆయన ఇంకా తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుని హత్యతో సంబంధాలున్న వ్యక్తులని అంతమొందించేందుకు శ్రీధర్ బాబు నయీంతో చేతులు కలిపాడని ఆరోపించారు. త్వరలో తాను ముఖ్యమంత్రి కెసిఆర్ ని, డిజిపి అనురాగ్ శర్మని కలిసి శ్రీధర్ బాబుపై విచారణ జరుపవలసిందిగా కోరుతానని చెప్పారు.

మధు చేసిన ఈ ఆరోపణలపై శ్రీధర్ బాబు కూడా తీవ్రంగా స్పందించారు. మధు వంటి కొందరు తెరాస నేతలు తనని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈవిధంగా తప్పుడు కధలు ప్రచారం చేస్తూ తనని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే నయీం కేసుపై సిబిఐ దర్యాప్తుని కోరాలని, అప్పుడు అధికార పార్టీలో ఎవరెవరికి నయీంతో సంబంధాలు ఉన్నాయో బయటపడతాయని అన్నారు. తనకి నయీంతో ఎటువంటి సంబంధాలు లేవని, ఉన్నట్లు నిరూపించి చూపితే తాను ఏ శిక్షని ఎదుర్కోవడానికైనా సిద్దం అని శ్రీధర్ బాబు సవాలు విసిరారు. 

ఒకప్పుడు ఓటుకి నోటు కేసుతో ఏపి సిఎం చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలందరినీ తెరాస సర్కార్ నియంత్రించగలిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలకి నయీంతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తుండటం ద్వారా ఈ కేసుని కూడా వారిపై ఒక బలమైన అస్త్రంగా ఉపయోగించుకొంటోందా? అనే అనుమానం కలుగుతోంది. నయీంతో కొందరు తెరాస నేతలు, పోలీస్ ఉన్నతాధికారులకి కూడా సంబంధాలు ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కనుక దీనిపై సిబిఐ చేత సమగ్ర విచారణకి ఆదేశించినట్లయితే ఎవరికీ అనుమానాలు ఉండవు కదా?