తెదేపాలో చంద్రబాబు నాయుడు వారసుడు ఎవరు అని ప్రశ్నిస్తే అందరూ నారా లోకేష్ అని తడుముకోకుండా చెపుతారు. నేడోరేపో లోకేష్ కి మంత్రిపదవి ఇవ్వబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తెదేపా నేతలు కూడా వాటిని దృవీకరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు నారా లోకేష్ “నాకు ఏ మంత్రి పదవి వద్దు బాబోయ్!” అంటున్నారు.
యూపిలో తండ్రికొడుకులు (ములాయం, అఖిలేష్) మద్య జరుగుతున్న గొడవలు చూసి ఆ మాట అంటున్నారు. అది చూసి పార్టీ నేతలు కంగుతిని ఉండవచ్చు.
గుంటూరులో తెదేపా నేతలతో లోకేష్ నిన్న సమావేశం అయినప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది. “అక్కడ మంత్రి పదవి కోసం తండ్రీ కొడుకులు కొట్లాడుకొంటూ పార్టీని, ప్రభుత్వాన్ని బజారుకీడ్చేయడం చూస్తూనే ఉన్నారు కదా? నావలన నా తండ్రికి, మన పార్టీకి, మన ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి కలగకూడదని కోరుకొంటున్నాను. అందుకే నాకు మంత్రి పదవి వద్దు,” అని అన్నారు. కానీ వచ్చే ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తానని గతంలోనే చెప్పారు కనుక పోటీ చేయడం తధ్యమనే అనుకోవచ్చు.