జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కథువా జిల్లాలో సరిహద్దుల వద్ద ఈనెల 21న ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకొనే ప్రయత్నంలో గుర్నాం సింగ్ వారికి అండగా నిలిచిన పాక్ సైనికుల కాల్పులలో తీవ్రంగా గాయపడ్డారు. అతనిని జమ్మూ ఆర్మీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు కానీ శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మరణించాడు. అతని శరీరానికి ఆర్మీ సంప్రదాయాల ప్రకారం గౌరవవందనం సమర్పించిన తరువాత, అతని కుటుంబ సభ్యులకి అందజేశారు. ఈరోజు అతని స్వగ్రామం మగోవలిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గుర్నాం సింగ్ పేరుని అత్యున్నత సైనిక పురస్కారం అశోకచక్రకు సిఫారసు చేస్తానని బి.ఎస్.ఎఫ్.అదనపు డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ మీడియాకి తెలిపారు. తమ కుమారుడి పేరిట ఒక సైనిక ఆసుపత్రి నెలకొల్పాలని అతని తల్లి తండ్రులు విజ్ఞప్తి చేశారు. తమ కుమారడు దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేసినందుకు తామంతా చాలా గర్వపడుతున్నామని అతని తల్లి జస్వంత కౌర్, తండ్రి కుల్బీర్ సింగ్ అన్నారు.
సరిహద్దులో ఉగ్రవాదులతో లేదా పాక్ సైనికులతో పోరాడుతూ ఈవిధంగా చాలా మంది సైనికులు గాయపడుతుంటారు. వారిలో కొంతమంది ఈవిధంగా మరణిస్తుంటారు. అప్పుడు మీడియాలో ఈవిధంగా వార్తలు వస్తుంటాయి. అంతా రొటీన్ అన్నట్లుగా తయారైపోయింది.
జయలలిత లేదా సోనియా గాంధీ అనారోగ్యం పాలైతే చాలా వేగంగా స్పందించి దేశ విదేశాల నుంచి అత్యుత్తమ వైద్య నిపుణులని ప్రత్యేక విమానాలలో రప్పించే మన ప్రభుత్వం, సరిహద్దులలో చాలా దారుమైన వాతావరణ పరిస్థితులలో ఉగ్రవాదులతో, శత్రు సైనికులతో ప్రాణాలకి తెగించి పోరాడుతున్న మన వీరసైనికులు గాయపడినప్పుడు ఇంత ఆశ్రద్దగా, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దారుణం. చాలా బాధాకరం. గుర్నాం సింగ్ ని కనీసం డిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా బాగుండేది. కనీసం ఎయిమ్స్ నుంచి వైద్య నిపుణులని జమ్మూకి పంపించి వారితో చికిత్స అందించినా బాగుండేది. కానీ అతని ప్రాణాలు జయలలిత, సోనియా గాంధీల ప్రాణాలంత విలువైనవి కావని ప్రభుత్వం భావించినట్లుంది. అందుకే జమ్మూ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సతో సరిపెట్టేసి సెల్యూట్ కొట్టేసిందనుకోవలసి ఉంటుంది.
ఆర్మీ జవాన్ల పట్ల కేంద్రప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఇటువంటి వైఖరి మన వీర సైనికుల మానసిక ధైర్యాన్ని దెబ్బ తీస్తుంది. తమ తోటి సైనికుడు తీవ్రంగా గాయపడితే, ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తుందో కళ్ళారా చూస్తున్న మిగిలిన జవాన్లు, ఈసారి సరిహద్దులలో ఉగ్రవాదులు దాడులకి తెగబడితే తమ ప్రాణాలని కాపాడుకోవడం కోసం వారు కేవలం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఏమవుతుంది? ప్రభుత్వం ఆలోచించాలి.