తెలంగాణా జాగృతి సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ తెరాస ఎంపి కవిత ఈరోజు సోమాజీగూడ ప్రెస్ క్లబ్బులో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈ రెండున్నరేళ్ళుగా మా ప్రభుత్వం చేసిన కృషి ఫలించి దశాబ్దాలుగా నిరాదరణకి గురైన మన తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకి మళ్ళీ పూర్వ వైభవం పొందాయి. వాటికి మళ్ళీ స్వర్ణయుగం వచ్చింది. బతుకమ్మ పండుగ గురించి యావత్ దేశ ప్రజలకే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలకి తెలియజేయగలిగాము. ఈసారి బతుకమ్మ పండుగలో విదేశీ మహిళలు కూడా ఆడిపాడటం నాకు చాలా సంతోషం కలిగించింది. మా ప్రభుత్వంలో మహిళలకి చోటు కల్పించలేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలని పట్టించుకొనక్కరలేదు. మహిళలకి మంత్రిపదవులు ఇవ్వనప్పటికీ రాష్ట్రంలో మహిళలందరికీ మా ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తోంది,” అని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు, తెరాస సర్కార్ పై చేస్తున్న విమర్శలని కూడా పట్టించుకోనవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అవి తమ మనుగడకోసమే హడావుడి చేస్తున్నాయని కనుక వాటి మాటలని ప్రజలు కూడా పట్టించుకోవడంలేదని ఆమె అభిప్రాయ పడ్డారు. వచ్చే ఎన్నికలలో ఈ పార్టీలన్నీ కనబడకుండా కొట్టుకుపోతాయని, మళ్ళీ తెరాస పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమని ఆమె అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోకుండా విమర్శించడం మానుకోవాలని ఆమె ప్రతిపక్షాలకి హితవు పలికారు. సమాచార చట్టం హక్కు ద్వారా ప్రభుత్వం నుంచి అడిగితీసుకొని, వాటిపై అధ్యయనం చేసిన తరువాత మాట్లాడితే బాగుటుందని ఆమె అభిప్రాయపడ్డారు.