రెండున్నరేళ్ళలోనే రాష్ట్రంలో ఇంత మార్పా?

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ పోటాపోటీగా సభలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్లు అందరికంటే ఆలశ్యంగా మేల్కొన్నా సిపిఎం పార్టీ 5 నెలల పాటు మహాజన పాదయాత్ర కార్యక్రమంతో రాష్ట్రంలో తన ఉనికిని గట్టిగా చాటుకొనే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాల గురించి అందరూ చూస్తూనే ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెరాస సర్కార్ తో అది మొదలుపెట్టిన పోరాటం, అనేక రూపాలు మార్చుకొంటూ ప్రస్తుతం విద్యార్ధుల ఫీజ్ రీఎంబర్స్ మెంట్ తో మహా ఉదృతంగా సాగుతూనే ఉంది. బహుశః దాని పోరాటాలు చూసి తెరాసలో చేరిన కాంగ్రెస్ నేతలు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచించినా ఆశ్చర్యమేమీ లేదు. 

మద్యలో కొంతకాలం డల్ అయిపోయే అలవాటున్న భాజపా కూడా ఇక నుంచి తెరాస సర్కార్ పై అలుపెరుగని పోరాటాలు చేయడానికి సిద్దమవుతోంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే రైతుల సమస్యలు, విద్యార్ధుల ఫీజ్ రీఎంబర్స్ మెంట్, హామీల అమలు మొదలైన అంశాలతో తెరాస సర్కార్ యుద్దానికి సిద్దం అవుతోంది. ఈ విషయం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రంలో తెరాసకి గట్టి సవాలు విసిరిన తెదేపా మాత్రం బలమైన నాయకత్వం లేకపోవడం వలన చాలా డల్ అయిపోయినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నడూ తన ఉనికిని చాటుకోవడానికి కూడా ఇష్టపడని వైకాపా కూడా మిగిలిన పార్టీలని చూసి రైతు సమస్యలపై పోరాడాలని ఆలోచిస్తోందిట! 

అధికార, ప్రతిపక్షాల ఈ పోరాటాలు, విమర్శలు చూస్తుంటే రెండున్నరేళ్ళ క్రితం తెలంగాణా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితికి ఇప్పటికీ తేడా చాలా స్పష్టంగా కనబడుతోంది. అప్పుడు తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉన్నకారణంగా తెరాస మాటకి తిరుగు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు గొంతే చాలా గట్టిగా వినబడుతోంది. తెరాస సర్కార్ తమ ప్రభుత్వం అంత గొప్ప ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా ఉండబోదని బల్లగుద్ది వాదిస్తుంటే, ఇంత అసమర్ధ ప్రభుత్వం భూమండలం మీద మరెక్కడా కనబడదని ప్రతిపక్షాలు డంకా బజాయించి వాదిస్తున్నాయి. ఇటువంటి సమస్య ఎదుర్కోకూడదనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ కనిపెట్టిన “రాజకీయ శక్తుల పునరేకీకరణ మంత్రం” కూడా బొత్తిగా పనిచేయడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు కీచులాటలు చాలా సర్వసాధారణం అయిపోయాయి. అంటే తెలంగాణాలో కూడా మళ్ళీ రొటీన్ రాజకీయాలు వచ్చేశాయన్నమాట! అందుకు సంతోషించాలా లేక బాధ పడాలా?