ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్‌ఐఏ సోదాలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఓ పక్క ఈడీ బృందాలు సోదాలునిర్వహిస్తుంటే మరోపక్క ఎన్‌ఐఏ బృందాలు కూడా సోదాలు నిర్వహిస్తుండటం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో 38 చోట్ల ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేశాయి. హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో, ఏపీలో నెల్లూరు, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలలో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేశాయి. 

 పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ ‘చట్టపరమైన హక్కులు’ శిక్షణ ముస్గులో ఉగ్రవాదులను తయారుచేస్తోందని ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది. ఎన్‌ఐఏ ఇచ్చిన సమాచారంతో తెలంగాణ పోలీసులు జూలై 4వ తేదీన ఆ సంస్థకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగానే ఎన్‌ఐఏ బృందాలు నిన్న హైదరాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిర్మల్ జిల్లాలోని భోదన్ పట్టణంలో సోదాలు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకొన్నారు. ఒక్క నిజామాబాద్‌ పట్టణంలోనే ఎన్‌ఐఏ బృందాలు 23 చోట్ల సోదాలు నిర్వహించాయి. 

ఎన్‌ఐఏ అధికారులు వారి వద్ద నుంచి కొన్ని హార్డ్ డిస్కులు, ఫోన్‌ నంబర్లున్న కొన్ని డైరీలు, కీలక పత్రాలు, రూ.8.31 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నట్లు టీవీలో వస్తున్న వార్తలు చూసి మరో వ్యక్తి పరారయ్యాడు. అతని కోసం తెలంగాణ పోలీసులు, ఎన్‌ఐఏ బృందాలు గాలిస్తున్నాయి.