తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవానికి బదులుగా జాతీయ సమైక్య వజ్రోత్సవ దినోత్సవంగా నిర్వహిస్తోంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ఈ వేడుకలలో సిఎం కేసీఆర్ ప్రసంగిస్తూ, “1948, సెప్టెంబర్ 17న హైదరాబాద్ విశాల భారతదేశంలో విలీనం అయ్యింది. దేశంలో అనేక సంస్థానాలు క్రమంగా భారత్‌లో విలీనం అవడంతో దేశంలో రాజరిక పాలన అంతరించి ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఆనాడు ప్రజాపోరాటాలు చేసిన మహనీయులందరినీ ఈ సందర్భంగా మనం స్మరించుకొందాము. స్వాతంత్ర్యానికి పూర్వమే హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది. కానీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పేరుతో హైదరాబాద్‌ని బలవంతంగా ఏపీలో కలిపారు.
ఆనాడు చిన్న ఏమరపాటు వలన 58 ఏళ్ళపాటు పరాయిపాలనలో మగ్గుతూ మన హక్కులు, అధికారాల కోసం సుదీర్గపోరాటాలు చేయవలసి వచ్చింది. తెలంగాణ సాధించుకోవడానికి మనం ఎంతగా పోరాడవలసివచ్చిందో మీ అందరికీ తెలుసు. పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొంటే కొన్ని మతతత్వశక్తులు రాష్ట్రంలో ప్రజల మద్య చిచ్చు రగిలించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. అందుకోసం చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయి. కనుక మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఆ శక్తుల చేతిలోకి వెళ్ళిపోతే మళ్ళీ పరిస్థితి మొదటికొస్తుంది. కనుక రాష్ట్ర ప్రజలందరూ అటువంటి మతతత్వశక్తులను దూరంగా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
ఈ కార్యక్రమం తర్వాత బంజారాహిల్స్ రోడ్ నం:10లో కొత్తగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్‌ను ఆదివాసీ భవన్, కుమ్రం భీం ఆదివాసీ భవన్‌లను సిఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ భవనాలను కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు మాత్రమే గాక అర్దవంతమైన సమావేశాలు, చర్చలకు వినియోగించుకోవాలని సిఎం కేసీఆర్ సూచించారు.