నా భర్తకు మరికాస్త సమయం ఇవ్వండి: ఉషాభాయి

ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముస్లింల మనోభావాలు దెబ్బతినేవిదంగా మాట్లాడినందుకు, బిజెపి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరాదో 10 రోజులలో వివరణ ఇవ్వాలని  క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అయితే పోలీసులు ఆయనపై పీడీ చట్టం కింద అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో వేశారు. కనుక ఆయన వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య ఉషాభాయి బిజెపి క్రమశిక్షణ కమిటీకి ఓ లేఖ వ్రాశారు. ఆమె విన్నపం సహేతుకంగా ఉన్నందున బిజెపి మరికొంత సమయం ఇస్తుందో లేదా తన వ్యాఖ్యలతో పార్టీకి, మోడీ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించినందుకు పార్టీ నుంచి బహిష్కరిస్తుందో సోమవారంలోగా తేలిపోవచ్చు. ఒకవేళ బిజెపి నుంచి బహిష్కరించినట్లయితే, ఇంతవరకు తిరుగేలేదన్నట్లు బ్రతికిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కష్టాలు మొదలైనట్లే!