మర్రి శశిధర్ రెడ్డికి అద్దంకి సున్నితంగా చురకలు

మునుగోడు ఉపఎన్నికల గంట ఏ క్షణాన్నైనా మోగొచ్చు. ఇటువంటి సమయంలో కూడా కాంగ్రెస్‌ నాయకులు వారిలో వారు కీచులాడుకొంటూ కాలక్షేపం చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, పార్టీ ఇన్‌ఛార్జి మానిక్కం ఠాగూర్, రేవంత్‌ రెడ్డి, అద్దంకి దయాకర్‌లను ఉద్దేశ్యించి తీవ్ర విమర్శలు చేయగా వాటికి మానిక్కం ఠాగూర్ నిన్ననే ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈరోజు అద్దంకి దయాకర్‌ కూడా వీడియో ద్వారా మర్రి శశిధర్ రెడ్డికి సున్నితంగా చురకలు వేశారు. 

పార్టీలో ఏదైనా సమస్య తలెత్తితే మీవంటి సీనియర్ నేతలు చొరవ తీసుకొని ఆ సమస్య సద్దుమనిగేలా చేయాలి కానీ మరింత పెద్దది చేయకూడదు. కాంగ్రెస్‌ నేతలు వారిలో వారే కీచులాడుకొంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇది పార్టీకి చాలా నష్టం కలిగిస్తుంది. కానీ మీవంటి సీనియర్లు కూడా పార్టీలో సమస్యలు మరింత పెద్దవయ్యే విదంగా మాట్లాడటం సరికాదని భావిస్తున్నాను.

బిజెపి, ఆర్‌ఎస్ఎస్‌లు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో కాంగ్రెస్‌ నేతలు పావులుగా మారుతున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలే అనుకొంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు. కనుక ఈ సమస్యల మీవంటి సీనియర్లు చొరవ తీసుకొని పరిష్కరించగలిగితే బాగుంటుంది కానీ మీ విమర్శలతో మరింత పెద్దది చేయడం సబబు కాదని భావిస్తున్నాను.

ఇప్పుడు నేను ఎందుకు స్పందిస్తున్నానంటే, మీరు నాపై కూడా కొన్ని విమర్శలు చేశారు అందుకే. మీకు ఆ హక్కు ఉంది కనుక నేను వాటిని పట్టించుకొను. కానీ మీ వల్ల పార్టీకి మరింత నష్టం కలగకుండా చూసుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాను,” అని అన్నారు.