సిఎం కేసీఆర్ ఈరోజు వికారాబాద్ పట్టణంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పట్టణంలో కొత్తగా నిర్మించిన టిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. తర్వాత ఉస్మానియా మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. రూ.42 కోట్లు వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మించారు. నిర్మాణం పూర్తయి ఏడాదిపైనే అయ్యింది. కానీ సిఎం కేసీఆర్‌కు సమయం కుదరకపోవడంతో ఇంతకాలం ఆలస్యమైంది.
కొత్త సమీకృత కలెక్టరేట్ కార్యాలయం అందుబాటులోకి రావడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ త్వరలో దీనిలోకి మారనున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోటకి వస్తే ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులు అందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది.
సిఎం కేసీఆర్ వికారాబాద్ పట్టణంలో పర్యటిస్తుండగా కొందరు బిజెపి కార్యకర్తలు కాషాయ జెండాలు పట్టుకొని ఆయన కాన్వాయ్‌ని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిపై స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. తర్వాత జరిగిన బహిరంగసభలో సిఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.