కేసీఆర్‌ కోసం చాలా సేపు ఎదురుచూశాం కానీ రాలేదు: గవర్నర్‌

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఏటా ఆగస్ట్ 15వ తేదీన గవర్నర్‌ రాష్ట్రంలో ప్రముఖులను రాజ్ భవన్‌కు ఆహ్వానించి ‘ఎట్ హోమ్’ పేరుతో తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీ. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సిఎం కేసీఆర్‌కు వ్యక్తిగతంగా లేఖ వ్రాసి ఆహ్వానించారు. అందుకు కేసీఆర్‌ కూడా అంగీకరించి సాయంత్రం 7 గంటలకు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. సిఎం కేసీఆర్‌ రాజ్ భవన్‌కు వస్తున్నట్లు సమాచారం అందడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ మార్గంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ 7.30 గంటలైనా సిఎం కేసీఆర్‌ రాలేదు. వస్తారో రారో... సీఎంవో కూడా సమాచారం ఇవ్వలేదు. 

అప్పటికే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ దంపతులు, మహారాష్ట్ర, తమిళనాడు మాజీ గవర్నర్లు చెన్నమేనేని విద్యాసాగర్ రావు, పిఎస్ రామ్మోహన్ రావు, హైదరాబాద్‌ సిపి సివి ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య, బిజెపి  ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పలువురు ప్రముఖులు వచ్చి సిఎం కేసీఆర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు అరగంట సేపు వేచి చూసినా సిఎం కేసీఆర్‌ రాక గురించి ఎటువంటి సమాచారం రాకపోవడంతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తేనీటి విందును ప్రారంభించారు. సిఎం కేసీఆర్‌ ఎందుకు రాలేదో తనకు తెలీదు కానీ రానపుడు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే గౌరవంగా ఉండేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.