జనగామలో బండి సంజయ్‌ పాదయాత్రలో రాళ్ళదాడి

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా నేడు జనగామ జిల్లా దేవరుప్పల చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తుండగా, టిఆర్ఎస్‌ కార్యకర్తలు అక్కడకు చేరుకొని బిజెపికి బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో బిజెపి కార్యకర్తలు టిఆర్ఎస్‌ కార్యకర్తలను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పరం రాళ్ళు రువ్వుకొని కర్రలతో దాడులు చేసుకొన్నారు. టిఆర్ఎస్‌ కార్యకర్తలు బిజెపి ఫ్లెక్సీలను దగ్దం చేసి అక్కడే ఉన్న బిజెపి కార్లపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. 

పోలీసులు ఇరువర్గాలపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టి పరిస్థితులు అదుపుతప్పకుండా కాపాడారు. బండి సంజయ్‌ అక్కడి నుంచే డిజిపి మహేందర్ రెడ్డికి ఫోన్‌ చేసి తమపై టిఆర్ఎస్‌ కార్యకర్తలు రాళ్ళు, కర్రలతో దాడులు చేశారని ఫిర్యాదు చేశారు. తాను పోలీసుల అనుమతి తీసుకొని పాదయాత్ర చేస్తుంటే జిల్లా ఎస్పీ, పోలీస్ కమీషనర్ తనకు రక్షణ కల్పించలేకపోయారని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిరువురికీ సిఎం కేసీఆర్‌ తన జేబులో నుంచి తీసి జీతాలు చెల్లించడంలేదని, ప్రజాధనం నుంచే చెల్లిస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. కానీ వారిరువురూ సిఎం కేసీఆర్‌కు వీరవిధేయుల్లా వ్యవహరిస్తూ, తమపై టిఆర్ఎస్‌ కార్యకర్తలు దాడులు చేస్తారని తెలిసి ఉన్నప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుక డిజిపి మహేందర్ రెడ్డి తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని, తమపై దాడులు చేసినవారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. ఈ ఘటనలతో అప్రమత్తమైన జిల్లా పోలీసు అధికారులు మరింత మంది పోలీసులను బండి సంజయ్‌ పాదయాత్రకు కేటాయించారు.