స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి నేటితో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వజ్రోత్సవ వేడుకలను జరుపుకొంటున్నాము. ఆనాడు ఎందరో మహానుభావుల నాయకత్వంలో కోట్లాదిమంది సామాన్య ప్రజలు అలుపెరుగని పోరాటాలు చేసి భారత్‌కు స్వాతంత్ర్యం సాధించారు. ఆ పోరాటలలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసినవారు... బ్రిటిష్ అధికారుల దురహంకారానికి బలైనవారు, బ్రిటిష్ సైనికుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నవారు, ఏళ్ళకు ఏళ్ళు జైళ్ళలో మగ్గినవారు ఎందరో లెక్కలేదు. 

కనుక ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్చా స్వాతంత్ర్యాలు వారు పెట్టిన భిక్షే. వారు తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టి వెళ్ళిపోయారు. మనం దానిని అనుభవిస్తున్నాము. ఇటువంటి సందర్భాలలో వారి త్యాగాలను గుర్తుచేసుకొని నివాళులు ఆర్పిస్తున్నాము. 

అయితే వారి త్యాగాల ఫలమైన ఈ స్వతంత్ర భారతదేశం నేడు ఎటువంటి పరిస్థితులలో ఉంది?అని ఓసారి ఆత్మవిమర్శ చేసుకొంటే, అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. ఆనాటి రాజకీయనాయకుల తీరుకి నేటి నాయకుల తీరుకి ఎంత తేడా ఉందో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నాము. నేడు కేంద్రానికి, రాష్ట్రాలకు పడటంలేదు. మళ్ళీ రాష్ట్రాలలో ప్రభుత్వాలకి, ప్రతిపక్షాలకి పడటం లేదు. ప్రజలలో కుల మతాలు విభేధాలు మరింత ఎక్కువయ్యాయి.   

అయితే నేటికీ భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తోంది కానీ చాలా బలహీనపడింది. ప్రజలందరినీ ఒక్క తాటిపై నడిపించవలసిన నాయకులే తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను కులమతాలవారీగా విడదీసి వాడుకొంటున్నారు. కొద్దిమంది నేతల మాయలో 135 కోట్లాదిమంది ప్రజలు కొట్టుకుపోతున్నారు. 

నాటితో పోలిస్తే భారత్‌ చాలా అభివృద్ధి చెందింది. కానీ రెండుసార్లు అణుబాంబుల దాడులకు గురైన జపాన్‌తో పోల్చుకొని చూస్తే మనం సాధించిన ప్రగతి చాలా తక్కువ అని అర్దం అవుతుంది. ఇందుకు కారణం భారత్‌లో మేధో శక్తి, సహజవనరులు లేకపోవడం కాదు. నాయకత్వలోపాలే కారణం అని  చెప్పకతప్పదు. 

సరైన నాయకత్వం, ఆ నాయకుడికి దూరదృష్టి, చిత్తశుద్ధి, తపన ఉంటే ఏవిదంగా ఓ రాష్ట్రం ఎంత వేగంగా, ఏవిదంగా అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోవడానికి మన తెలంగాణ రాష్ట్రమే ఓ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ఒక రాష్ట్రంలో సాధ్యమైనది ఇతర రాష్ట్రాలలో సాధ్యం కాదా? దేశమంతటా సాధ్యం కాదా?అని ప్రశ్నించుకొంటే సాధ్యమే అని అర్దం అవుతుంది. 

కానీ నేటికీ దేశంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. నానాటికీ పెరుగుతున్న ధరల కారణంగా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాలకులు ప్రజల అసంతృప్తిని గుర్తించలేదని అనుకోలేము. కానీ ప్రజలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నందున, వారిని మాయ మాటలు, తాయిలాలతో ప్రలోభపెడుతూ ఇష్టారాజ్యం చేస్తున్నారు. కనుక ప్రజలు ఆ మాయలో నుంచి బయటపడి సమర్దుడైన నాయకుడిని ఎన్నుకొన్నప్పుడే తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని గ్రహించినప్పుడే మార్పు మొదలవుతుంది. అటువంటి రోజు వస్తుందని ఆశిద్దాం.