మునుగోడు ఉపఎన్నికలకు అభ్యర్ధులు ఖరారు?

హటాత్తుగా వచ్చి పడుతున్న మునుగోడు ఉపఎన్నికలకు టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా చల్లమల్ల కృష్ణా రెడ్డి, బిజెపి అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2018 ముందస్తు ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఆయనకే అవకాశం ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కానీ నల్గొండ జిల్లా టిఆర్ఎస్‌ నేతలు ఆయన పట్ల విముఖత వ్యక్తం చేస్తుండటంతో మంత్రి జగదీష్ రెడ్డి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మునుగోడు ఉపఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న సీనియర్ కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు పాల్వాయి స్రవంతి చల్లమల్ల కృష్ణా రెడ్డి పేరును ఖరారు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉపఎన్నికలలో ఆయనకు సహకరించబోనని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దృష్టికి కూడా వచ్చింది. కనుక     ఇప్పటికిప్పుడు చల్లమల్ల కృష్ణా రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించకుండా ఈ నెల 16 నుంచి మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తూ పాల్వాయి స్రవంతి వంటి అసంతృప్తి నేతలందరినీ స్వయంగా కలిసి బుజ్జగించి ఒప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

బిజెపి అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ నెల 21న మునుగోడులో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఆయన సమక్షంలో రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేర్చుకొని అభ్యర్ధిగా ప్రకటించనున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే మునుగోడులో పర్యటిస్తూ కాంగ్రెస్‌ క్యాడర్‌ను కలుస్తూ తన వెంట బిజెపిలోకి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు.