చల్లమల్లకి టికెట్ ఇస్తే ఇంతే సంగతులు: పాల్వాయి స్రవంతి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరుగబోతున్న మునుగోడు ఉపఎన్నికలలో ఆ సీటును మళ్ళీ ఎలాగైనా గెలుచుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక మొన్న చండూరులో బహిరంగసభ పెట్టి రాజగోపాల్ రెడ్డిని, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలపై ఎదురుదాడి మొదలుపెట్టేశారు. 

బుదవారం మధ్యాహ్నం గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలందరితో సమావేశమయ్యి మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎవరిని నిలపాలనే అంశంపై చర్చిస్తున్నారు. అక్కడ సమావేశం జరుగుతుండగా, మునుగోడు టికెట్ ఆశిస్తున్న సీనియర్ కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు, (దివంగత పాల్వాయి గోవర్ధన్ కుమార్తె) పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌ కార్యకర్తతో మాట్లాడిన ఓ సంభాషణ మీడియాలో లీక్ అయ్యింది. 

మునుగోడు ఉపఎన్నికలో చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని, కనుక కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే తనకే టికెట్ ఇవ్వాలని ఆమె అన్నారు. అప్పుడు ఆ కార్యకర్త “అవును మేడం... మునుగోడు మీ నాన్నగారు పాల్వాయి సార్ నియోజకవర్గం. ఆయన కుమార్తె అయిన మీరు మాత్రమే గెలవగలరు,” అని అన్నాడు. అప్పుడు ఆమె “మొన్న చండూరు సభకు నేను పిలిస్తే మీరందరూ వచ్చారా లేక ఆయన పిలిస్తే వచ్చారా? ఆ సభ నావల్లే కదా విజయవంతమైంది. మరిప్పుడు రేవంత్‌ రెడ్డి హటాత్తుగా కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తానంటున్నారు,” అని అన్నారు.         

అప్పుడు ఆ కార్యకర్త “అవును మేడం రాత్రికి రాత్రే అంతా మారిపోయింది. పొద్దున లేచి చూస్తే పేపర్లు, టీవీలలో ఇదే వార్త. ఇక్కడ మీరైతేనే గెలుస్తారు. కనుక మీరే ఎలాగైనా టికెట్ సంపాదించి పోటీ చేయాలి మేడం,” అని అన్నాడు. 

అప్పుడు ఆమె, “నా ప్రయత్నాలు నేనూ చేస్తున్నాను. మరి మునుగోడు టికెట్ ఇస్తారో లేదో చూడాలి,” అన్నారు. 

మునుగోడు ఉపఎన్నికల కంటే ముందు పార్టీలో నేతల మద్య పోటీ మొదలైంది కనుక రేవంత్‌ రెడ్డి ముందుగా ఈ సంస్యను పరిష్కరించుకోవలసి ఉంటుంది. లేకుంటే కీలకమైన మునుగోడు ఉపఎన్నికలకు ముందు పార్టీలో అసమ్మతి దాంతో ఎన్నికలల్ ఓటమి తప్పకపోవచ్చు.