లక్షల్లో జీతాలు తీసుకొంటారు పనిచేయరా? మంత్రి హరీష్‌ రావు

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో రూ.20.50 కోట్లు వ్యయంతో ఆధునీకరించిన ఈఎస్ఐ హాస్పిటల్‌ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు బుదవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్‌ వైద్యులతో ముఖాముఖి సమావేశమయినప్పుడు, వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్‌ను తీర్చిదిద్ది 55 మంది వైద్యులు, 56 మంది నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నప్పటికీ హాస్పిటల్‌లో నామమాత్రంగా చికిత్సలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిలో ఒక్కొక్కరికీ నెలకు లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నప్పటికీ హాస్పిటల్‌లో శస్త్రచికిత్సలు, ప్రసవాలు ఎందుకు చేయడం లేదని మంత్రి హరీష్‌ రావు గట్టిగా నిలదీశారు. 

ఈ ఏడాది జనవరిలో కేవలం 24 శాతం, ఫిబ్రవరిలో 29 శాతం, జూన్‌ నెలలో 49 శాతం హాస్పిటల్‌లో బెడ్స్ ఆక్యుపెన్సీ ఉండటంపై మంత్రి హరీష్‌ రావు వైద్యులను గట్టిగా నిలదీశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలోనే నెలకు 90-100 ప్రసవాలు జరుగుతుంటే, ఇంత పెద్ద హాస్పిటల్‌, ఇంత మంది వైద్యులు, సిబ్బంది ఉన్న హాస్పిటల్‌లో ముగ్గురు గైనకాలజిస్టులు ఒక నెలలో కేవలం మూడు ప్రసవాలు చేయడం ఏమిటని మంత్రి హరీష్‌ రావు నిలదీశారు. పక్కనే సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో నెలకు 700 ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎందుకు జరుగడం లేదని గట్టిగా నిలదీశారు. 

తరువాత ఆర్దోపెడిక్ వైద్యులను ఇదే విదంగా గట్టిగా నిలదీసి, శస్త్ర చికిత్సలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ ఒక్క ఆపరేషన్ కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని మంత్రి హరీష్‌ రావు గట్టిగా హెచ్చరించారు. వైద్యులు లక్షల్లో జీతాలు తీసుకొంటున్నప్పుడు బాధ్యతగా, మానవత్వంతో పనిచేయాలని, ఇదేవిదంగా కొనసాగితే ఇకపై ఎవరినీ ఉపేక్షించేది లేదని గట్టిగా హెచ్చారించారు. ఈ సందర్భంగా నలుగురు వైద్యులు నాలుగేళ్ళుగా విధులకు హాజరుకావడం లేదని తెలుసుకొని మంత్రి హరీష్‌ రావు హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పేర్లను తక్షణం పెరోల్స్ లోనుంచి తొలగించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.